
సాక్షి, అమరావతి: పసుపు–కుంకుమ పథకానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా మహిళలకు ఇచ్చేది అప్పు మాత్రమేనని ఒకవైపు చర్చ జరుగుతుండగా.. మూడు విడతల్లో మొత్తం రూ. 2137.66 కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధుల్ని మళ్లించేందుకు సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు ఆర్థిక శాఖ ప్రత్యేక పద్దు నిర్వహిస్తుండగా.. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి రూ.1668.60 కోట్లను, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి రూ. 469.06 కోట్లను పసుపు– కుంకుమ పథకానికి ఖర్చు చేయనున్నారు. మొదటి విడతలో ఫిబ్రవరి 1న మహిళలకు ఇస్తున్న చెక్కులకు డబ్బుల కోసం ఆ రెండు సబ్‌ప్లాన్ పద్దుల నుంచి రూ.534.41 కోట్లు ఇప్పటికే ట్రెజరీల ద్వారా విడుదలకు ప్రభుత్వం అనుమతించింది.
బాబును పొగిడేందుకు మరో రూ. 30 కోట్లు
పసుపు–కుంకుమ పథకంపై ఊరూరా ప్రచారం కోసం ప్రభుత్వ ఖజానా నుంచే మరో రూ.31.60 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్ని మండలాల వారీగా మూడుగా విభజించి మూడ్రోజుల పాటు ఊరూరా చంద్రబాబును పొగిడేందుకు సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా మూడ్రోజులు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నెలా 1 నుంచి 5 తేదీల మధ్య జరగాల్సిన పింఛన్ల పంపిణీని నిలిపేసి.. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో గ్రామాలు, వార్డుల్లో జరిగే సభల్లోనే వాటిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల్ని ఆదేశించింది. ఈ సభల్లో సీఎం చంద్రబాబును బాగా పొగిడేవారిని ప్రత్యేకంగా సన్మానించాలని సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ జిల్లా అధికారులకు సూచించారు. ఊరూరా సభల నిర్వహణకు ఖర్చుయ్యే రూ. 31.60 కోట్లను డ్వాక్రా సంఘాల బలోపేతానికి ఇచ్చే రివాల్వింగ్ ఫండ్, సంఘాల్లోని మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నిధులను మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment