సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానటరింగ్ కమిటీ నియామకం సరే...సమావేశం నిర్వహించడంపై దృష్టి పెట్టరా? దానిపై నోరెందుకు మెదపరు? పాలకులకు, అధికారులకు ఎస్సీ, ఎస్టీల సమస్యలు పట్టవా?’ ఇప్పుడీ ప్రశ్న దళిత, గిరిజనుల నుంచి వ్యక్తమవుతోంది. పత్రికల్లో వచ్చినా, సంఘాలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదు. సంబంధిత సామాజిక వర్గాల అధికారులు కీలక స్థానంలో ఉన్నా చొరవ చూపడం లేదు. ఎందుకంత చిన్న చూపో అర్థం కావడం లేదని దళిత, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు, గ్రామాల్లో ఎదుర్కొంటున్న చీదరింపులు, పట్టిపీడిస్తున్న అంటరానితనం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితులు, అట్రాసిటీ కేసుల పరిష్కారం తదితర వాటిపై చర్చించేందుకు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానటరింగ్ కమిటీ మూడు నెలలకొకసారి సమావేశం కావాలి. దాంట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే చర్యలకు సైతం సిఫార్సు చేయవచ్చు. అయితే, జిల్లాలో మూడు నెలలకొకసారి జరగాల్సిన సమావేశం చివరిగా 2015మేలో జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు సమావేశం కాలేదు.
నిబంధనలకు విరుద్ధంగా..
మూడు నెలలకొకసారి సమావేశం కాకపోవడం వల్ల నిరుపేద బాధిత దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపరంగా పోరాడేందుకు రావల్సిన పరిహారం సకాలంలో రావడం లేదు. అసలేం జరుగుతుందో చర్చించిన పాపానికి పోలేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫార్సులు వెళ్లడం లేదు. ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా 70మంది వరకు పరిహారం అందక న్యాయ పోరాటం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 160వరకు ఉన్న కేసుల ప్రగతిపై సమీక్ష జరగలేదు. అవి ఎంత వరకు వచ్చాయి? ఎన్ని కేసులపై చార్జిషీటు దాఖలయ్యాయి? కేసులు వాదిస్తున్న వారి పనితీరు ఎలా ఉంది?, తిరస్కరించిన కేసులేంటి? తదితర వాటిపై సమీక్ష జరగకపోవడంతో బాధితులు న్యాయానికి నోచుకోలేకపోతున్నారు. అలాగే, వివిధ రూపాల్లో కొనసాగుతున్న అంటరానితనంపై చర్చించాలి. జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఇప్పటికీ ఈ విధానం కొనసాగుతోంది. వాటిపై సీరియస్‌గా చర్యలు తీసుకునే విధంగా సిఫార్సులు చేయాల్సిన కమిటీయే సమావేశం కావడం లేదు. ఇదే విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలొచ్చాయి. కానీ, అధికారులకు చలనం కలగడం లేదు.
తాజాగా కొత్త కమిటీ
తాజాగా కొత్తగా విజిలెన్స్, మానటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎస్పీ సభ్యులుగా నియమితులయ్యారు. గ్రూప్ - 1 ఆఫీసర్లుగా గజపతినగరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చామంతి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జిల్లా ఆడిటర్ అధికారిగా నియమితులయ్యారు. నాన్ అఫీషియల్ సభ్యులుగా గుమ్మలక్ష్మీపురం మండలం తిక్కబాయికి చెందిన కొండగొర్రి వెంకటరావు, సాలూరు మండలం బి.ఎం.వలసకు చెందిన గెమ్మెల సురేష్, జామి మండలం జన్నివలసకు చెందిన బసవ సూర్యనారాయణ, గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన దుక్కా తులసీ, విజయనగరానికి చెందిన పి.చిట్టిబాబులను నియమించారు. ఎన్జీఓలుగా చీపురుపల్లికి చెందిన శోధన, కురుపాంకు చెందిన స్వార్డ్, పార్వతీపురానికి చెందిన జట్టు సంస్థను నియమించారు. కొత్త కమిటీ సరే...సమావేశమెప్పుడు నిర్వహిస్తారన్నదే ముఖ్యం. ఇప్పుడా సమావేశంపై అధికారులు నోరు మెదపడం లేదు. సమావేశం నిర్వహణ వైపు అడుగులేస్తేనే దళిత, గిరిజనులకు మేలు జరగనుంది.
కొత్త కమిటీ సరే.. సమావేశమెప్పుడు?
Published Thu, Apr 28 2016 11:54 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement