ప్రొద్దుటూరు క్రైం : పసిడిపురిగా పేరు పొందిన ప్రొద్దుటూరులో నమ్మకం పైనే రోజూ రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి రూ. కోట్లు ఆర్జించిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కేవలం నమ్మకం మీదనే ఇక్కడ నిత్యం రూ. లక్షలు విలువ చేసే బంగారు చేతులు మారుతుంది. ఇందుకు చిన్న చిత్తు కాగితం మినహా వారి మధ్య ఎలాంటి ప్రామిసరి నోట్లు ఉండవు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఐపీ పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడంతో నమ్మకానికి తూట్లు పడుతున్నాయి. ప్రొద్దుటూరులో సుమారు 2500కి పైగా బంగారు దుకాణాలు, వర్క్ షాపులు ఉన్నాయి. వ్యాపారులు 1200 మంది, స్వర్ణకారులు 5700 మంది ఉన్నారు. రోజూ ఇక్కడ సుమారు రూ. 5–6 కోట్ల పైబడి వ్యాపారం జరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే రెట్టింపు వ్యాపారం ఉంటుంది. బంగారు ఆభరణాలు తయారు చేయడానికి కొందరు ముందుగానే డబ్బు ఇవ్వగా, ఇంకొందరు వస్తువులు తయారు చేసిన తర్వాత ఇస్తారు. ఇక్కడి చిన్న చిన్న వ్యాపారులు రూ. లక్షలు విలువ చేసే బంగారు నగలను హోల్‌సేల్ వ్యాపారుల నుంచి తీసుకొని 15–20 రోజుల తర్వాత నగదు ఇస్తుంటారు. పైసా పెట్టుబడి పెట్టకుండానే కొందరు వ్యాపారులు రూ. లక్షలు వ్యాపారం చేస్తున్నారు.
ఇటీవల ఐపీ పెట్టేవారి సంఖ్య ఎక్కువ కావడంతో వ్యాపారుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో బంగారు వ్యాపారులు ఎక్కువగా ఉండటంతో తమ వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశముందని పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్ వ్యాపారుల వద్దనే కాకుండా ప్రజలు ఆర్డర్ ఇచ్చిన బంగారుతో కొందరు వ్యాపారులు ఉడాయించిన సంఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయి. పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నా ఐపీ పెట్టే సమయంలో కొందరు వారి కుటుంబ సభ్యుల పేరుతో బదలాయిస్తున్నారు.
మొయిన్‌బజార్ కూడలిలో చాలా కాలం నుంచి ఉన్న ఒక బంగారు వ్యాపారి సుమారు రూ. 15 కోట్లతో ఇటీవల ఐపీ పెట్టాడు. సుమారు 25 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నందున చాలా మంది అతనికీ బాకీ ఇచ్చారు.
రామేశ్వరానికి చెందిన మరో బంగారు వ్యాపారి కూడా కొన్ని నెలల క్రితం సుమారు 17 కోట్లతో ఉడాయించాడు. ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో పట్టణంలోని పలువురు పోలీసు అధికారులు ఇతనికి రూ. లక్షల్లో నగదు ఇచ్చారు.
∙పాత మార్కెట్ వెనుక వైపు ఉన్న ఒక బంగారు వ్యాపారి ఇటీవల బాకీలు చేసి పరారయ్యాడు. సుమారు రూ. 2.5 కోట్ల దాకా పలువురికి బాకీ ఉన్నట్లు తెలుస్తోంది.
∙బంగారు వ్యాపారంతోపాటు చిటీల వ్యాపారం చేస్తున్న ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని నలుగురు అన్నదమ్ములు 50 మంది వద్ద చిటీల పేరుతో సుమారు రూ.3 కోట్లు మేర బాకీ చేసి పరారయ్యారు. వన్‌టౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
∙మోక్షగుండం వీధిలోని స్వర్ణకారుడు ఇటీవల మూడు నెలల క్రితం రూ. 3 కోట్లకు ఐపీ పెట్టాడు.
∙మెయిన్‌బజార్‌లో బంగారు వ్యాపారం చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములు రూ. 6 కోట్లకు ఐపీ దాఖలు చేశారు.
∙సుందరాచార్యుల వీధిలో డార్నింగ్ సెంటర్ నిర్వహిస్తున్న టైలర్ ఇటీవల రూ. 1.30 కోట్లకు ఐపీ పెట్టి పారిపోయాడు.
∙హోమస్‌పేటలో సీట్ కార్నర్ నిర్వాహకుడు, సుందరాచార్యుల వీధిలో తండ్రీ కొడుకులు, మైదుకూరు రోడ్డులోని మిల్లు యజమాని, గాంధీరోడ్డులోని ఫ్యాన్సీ సెంటర్ నిర్వాహకుడు రూ. కోట్లలో బాకీలు చేసి ఐపీ దాఖలు చేశారు. పట్టణంలో చిట్టీల నిర్వహణ పేరుతో చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లకు రాని మోసం, ఐపీ కేసులు ప్రొద్దుటూరులో వందల్లో ఉన్నాయి. 119 మంది దాకా ఏడాదిలో సుమారు రూ.112 కోట్లు ఐపీ పెట్టినట్లు పోలీసు వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment