- ఫైల్ వెనక్కు పంపిన మంత్రి శిద్ధా రాఘవరావు
హైదరాబాద్ : ఏపీ రహదారులు, భవనాల శాఖలో అధికారుల పదోన్నతి వ్యవహారం ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగుల వెనక్కు అన్న చందంగా సాగుతోంది. డిప్యూటీ ఇంజినీర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించే సీనియారిటీ జాబితాపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా, సూపరింటెండెంట్ ఇంజినీర్ల నుంచి చీఫ్ ఇంజినీర్లు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించేందుకు జాబితా సిద్ధం చేశారు. ఆరుగురు ఎస్‌ఈలను చీఫ్ ఇంజినీర్లుగా, మరో ఆరుగురు ఈఈలను ఎస్‌ఈలుగా పదోన్నతి కల్పించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల ఫైల్‌ను ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ ఆర్‌అండ్‌బీ మంత్రి శిద్ధా రాఘవరావుకు పంపారు. అయితే ఈ పదోన్నతుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని సదరు శాఖలోని కొందరు అధికారులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.
ముఖ్య ఇంజినీరు ఒకరు ఇష్టారీతిన పదోన్నతుల ఫైల్ రూపొందించారని ఫిర్యాదు చేశారు. డీఈల నుంచి ఈఈలుగా పదోన్నతులు కల్పించే అంశంలో సదరు ముఖ్య ఇంజినీరు అవకతవకలకు పాల్పడి ఆయన వర్గానికి పెద్ద పీట వేశారని ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి శిద్ధా రాఘవరావు ఆ ఫైల్‌ను వెనక్కు తిప్పి పంపారు. పదోన్నతుల వ్యవహారంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పదోన్నతుల వ్యవహారం మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. కాగా, ఆగస్టులో రూరల్ ఈఎన్‌సీగా ఉన్న వెంకటరెడ్డి పదవీ విరమణ చేస్తుండటం, కమిషనర్ ఆఫ్ టెండర్స్ సీఈ జ్ఞానరాజు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడంతో సీఈ పోస్టుల్లో ఖాళీలేర్పడనున్నాయి.