
మానవతావాదులకు కృతజ్ఞతలు తెలుపుతున్న బాలుడి తల్లి లక్ష్మీ
అనంతపురం, రాయదుర్గంటౌన్: గుమ్మఘట్ట మండలం గలగలపైదొడ్డి గ్రామానికి చెందిన తమ్మన్న, లక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు తొమ్మిదేళ్ల గొల్ల మారేష్ ‘సెప్టీసిమియా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకున్న అనంతపురంలోని సంజీవిని సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రమణారెడ్డి రాయదుర్గంలోని జన విజ్ఞాన వేదిక కార్యకర్త వీరణ్ణ సహాయంతో చికిత్స కోసం ముందుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం మారేష్ గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లగా అక్కడ ఎడమ కాలుకు ఓ ముల్లు గుచ్చుకుంది. ముల్లు గుచ్చుకున్న ప్రాంతంలో సెప్టిక్ అయింది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో గాయానికి సరైన వైద్యం అందలేదు.
దీంతో ఇన్ఫెక్షన్ అధికమై ఆ గాయం కాస్త సెప్టీసిమియా అనే అరుదైన వ్యాధిగా మారిపోయి కాలు పైవరకు పాకింది. కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉన్నా ఎవరూ గుర్తించలేకపోయారు. ఇరుగుపొరుగు వారి సలహాతో ఈ నెల 12న రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు చికిత్సలు అందజేయగా వ్యాధి తీవ్రతను గుర్తించి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. బాలుడి పరిస్థితిని కొందరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో స్పందించిన రమణారెడ్డి జేవీవీ కార్యకర్తతో పాటు ఇండేన్ గ్యాస్ మేనేజర్ కృష్ణ, సేవాంజలి సంస్థ ప్రతినిధులు లక్ష్మీనారాయణ గుప్త, తిమ్మప్ప తదితరుల సహకారంతో సోమవారం అంబులెన్స్‌లో అనంతపురం తీసుకెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment