విషాద యాత్ర | School Bus Accident In Ongole At Prakasam District | Sakshi
Sakshi News home page

విషాద యాత్ర

Published Fri, Mar 3 2017 2:59 PM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

విషాద యాత్ర - Sakshi

విషాద యాత్ర

సమయం తెల్లవారుజామున 3.05 గంటలు. రోజంతా ఆనందంగా గడిపిన చిన్నారులంతా ఆదమరిచి నిద్రపోతున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం. బ్రిడ్జి దాటాల్సిన బస్సు గాలిలో తేలుతూ 30 అడుగుల లోతున్న వాగులో పడింది. కేకలు.. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. బస్సులో కిక్కిరిసి ఉన్న విద్యార్థులంతా అసలేం జరిగిందో తెలియక భీతిల్లి పోయారు. రక్తపు గాయాలతో హాహాకారాలు చేశారు. మరో రెండు గంటల వ్యవధిలో ఇంటికి చేరుతామనుకునే సమయంలో బస్సు బ్రిడ్జి గుంతలో పడింది. గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 47 మంది గాయపడ్డారు. చిమ్మ చీకట్లో కదల్లేని స్థితిలో ఒకరినొకరు పట్టుకొని బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ హృదయ విదారక ఘటన పీసీపల్లి మండలం పెద అలవలపాడు వద్ద గురువారం వేకువజామున జరిగింది. బస్సు డ్రైవర్‌ మద్యం మత్తు, స్కూలు టీచర్ల నిరక్ష్యం వెరసి విద్యార్థుల విహారయాత్రను విషాదయాత్రగా మార్చింది.         – కనిగిరి/పీసీపల్లి

► బ్రిడ్జి గుంతలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు
► పీసీపల్లి మండలం పెద అలవలపాడు వద్ద ప్రమాదం
► బస్సులో 88 మంది.. అందులో 78 మంది విద్యార్థులు
► 47 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
► చిమ్మ చీకట్లో చిన్నారుల హాహాకారాలు
► డ్రైవర్‌ మద్యం మత్తే ప్రమాదానికి కారణం


కనిగిరి/పీసీపల్లి: ఉలవపాడు మండలం కరేడులోని పోతుల వెంకట సుబ్బయ్య శ్రేష్టి (పీవీఎస్‌ఎస్‌) జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 78 మంది విద్యార్థులను టీచర్లు విహారయాత్రకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. యాగంటి, మహానంది, బెలూన్‌ గుహలు చూసేందుకు ఈనెల 28న రాత్రి 12 గంటలకు కరేడు నుంచి ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులో బయలు దేరారు. విహారయాత్ర ముగించుకుని మహానంది నుంచి బుధవారం రాత్రి 9 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు  డ్రైవర్‌ కాలేషా మద్యం సేవించి వాహనం  నడపడంతో పీసీపల్లి మండలం పెద అలవలపాడు బ్రిడ్జి వద్ద బస్సు 30 అడుగుల లోతులో ఉన్న వాగులో పడింది. ఈ ఘటనలో 47 మందికి గాపడగా అందులో 28 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలైన వారిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స  అనంతరం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థి వేల్పుల శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉంది.

భీతిల్లిన చిన్నారులు: బస్సులో ప్రయాణిస్తున్న వారంతా చిన్నారులే కావడంతో భయంతో భీతిల్లి పోయారు.   నిద్రలోనుంచి తేరుకున్న కొందరు అసలేం జరిగిందో తెలియక కొందరు.. గాయాల బాధలతో మరి కొందరు.. అమ్మా.. నాన్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఘనట సమయంలో బస్సులో మేల్కోనే ఉన్నా.. సుమారు 15 మంది విద్యార్థులు కళ్లముందు జరిగిన ఘటనతో కొంత సేపటి వరకు షాక్‌ నుంచి తేరుకోలేకపోయారు.

కేసులు నమోదు..: ప్రమాద స్థలిని ఆర్డీఓ కె.మల్లికార్జునరావు, డీఎస్పీ కె.ప్రకాశరావు, డిప్యూటీ డీఈవో లక్ష్మయ్య, డీఎంహెచ్‌వో యాస్మిన్, ఆర్టీఓ వెంకటేశ్వరరావులు పరిశీలించారు. ట్రావెల్స్‌ యాజమాన్యం, డ్రైవర్‌ ఎస్‌కే కాలేషా, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. డ్రైవర్‌ మద్యం తాగి బస్సు నడిపినట్టు ధ్రువీకరించారు. ఉపాధ్యాయులు చేపట్టిన విహారయాత్రకు విద్యాశాఖ తరపు నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని, జరిగిన ఘటనలో ఉపాధ్యాయుల తప్పుపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నట్లు డిప్యూటీ డీఈవో చెప్పారు.

సహాయక చర్యల్లో వైఎస్సార్‌ సీపీ నేతలు..: ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచారి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. చలికి వణుకుతూ అక్కడే ఉన్న విద్యార్థులను వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరికీ పూర్తి స్థాయిలో చికిత్స అందే వరకు బుర్రాతోపాటు కందుకూరు సమన్వయర్త తుమాటి మాధవరావు దగ్గర ఉండి చూసుకున్నారు.  

తాగేసి డ్రైవింగ్‌ చేశాడయ్యా...  
ఒంగోలు సెంట్రల్‌ : నా కొడుక్కి బాగైతే చాలయ్యా.. మంచి వైద్యం చేయించండి అంటూ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ తల్లి జయమ్మ రోదించింది. తన కొడుక్కి యాక్సిడెంట్‌ అయిందని చుట్టాలు ఫోన్‌ చేస్తే తన భర్త శ్రీను తాను హుటాహుటిన బయలుదేరి రిమ్స్‌ ఆస్పత్రికి వచ్చిన్నట్లు చెప్పింది. పొన్నలూరు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీను, జయమ్మ దంపతులకు శ్రీకాంత్‌ మొదటి సంతానం.  బాగా చదివించాలని స్తోమత లేకపోయినా ఎస్టీ హాస్టల్‌లో ఉంచి చదివించుకుంటున్నట్లు ఆ దంపతులు తెలిపారు. గత నెల 28న ఫోన్‌ చేసి కర్నూలు వెళుతున్నామని రూ.300 కావాలని అడిగాడని, అమ్మమ్మ, తాతయ్య వద్ద తీసుకోమని తాము సూచించిన్నట్లు తెలిపారు. అంతే అని తిరిగి వైద్యశాలలో ఇలా చూస్తున్నామని కంట తడిపెట్టారు. శ్రీకాంత్‌ తలకు దెబ్బ తగలడంతో ఎముక మెదడుకు గుచ్చుకుందని, దీనికి ఆపరేషన్‌ చేసినట్టు డాక్టర్లు చెప్పారన్నారు. తన కుమారుడిని ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చారని జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు తన కుమారుడి చికిత్సకయ్యే ఖర్చును జడ్పీ నిధుల నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. శ్రీకాంత్‌ వద్ద గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.వి.రమేష్‌ బాబు, కరేడు వసతి గృహ సంక్షేమ శాఖ అధికారి హనుమంతురావు తదితరులు ఉన్నారు.

బస్సు మూడు పల్టీలు కొట్టింది..: బ్రిడ్జికి దగ్గరలో స్పీడ్‌ బ్రేకర్‌ వచ్చినా..బస్సు వేగం తగ్గలేదు. ఒక్క సారిగా బస్సు పైకి లేచింది. దీంతో బస్సులో నిలబడి ఉన్న మేం భయంతో కేకలు వేశాం. అప్పటికే బస్సు అదుపు తప్పింది. నిమిషాల వ్యవధిలో బ్రిడ్జి రాళ్లను ఢీకొని గుంతలోకి పల్టీలు కొడుతూ కింద పడింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాం.  --- సాయి శివకృష్ణ, విద్యార్థి

మధ్యలో కూర్చోబట్టి తప్పించుకున్నాం.: కనిగిరిలో బస్సు ఆగింది. సుమారు 2.35 కనిగిరి నుంచి బయలుదేరాం. అప్పటి నుంచి మేము మేలోకుని ఉన్నాం. బస్సు మధ్య సీట్లతో మేమిద్దరం కూర్చున్నాం. 20 నిమిషాల్లో బ్రిడ్జిలోకి దూసుకెళ్లింది. బస్సు పల్టీలు కొట్టే టప్పుడు రాడ్లను గట్టిగా పట్టుకుని కేకలు వేశాం. బస్సు మధ్యలో ఉన్నవాళ్లకి చిన్న చిన్నగాయాలయ్యాయి. కిటికీల దగ్గర కూర్చున్న వాళ్లకు పెద్ద దెబ్బలు తగిలాయి.--- శివనందిని, లావణ్య, విద్యార్థినులు

మమల్ని ఆ దేవుడే కాపాడాడు...: నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. మేల్కొని చూసే సరికే బస్సు బ్రిడ్జి గుంతలోకి పోతుంది. నేను నా పక్కనే ఉన్న స్నేహితులు కలిసి బస్సులోని రాడ్లను గట్టిగా  పట్టుకుని బిగ్గరగా కేకలు పెట్టాం. సుమారు 30 అడుగుల గుంతలో పడి నేలకు గుద్దుకుని పల్టీలు కొట్టింది. మమలిన ఆ దేవుడే రక్షించాడు. ------ విష్ణు, విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement