బషీరాబాద్, న్యూస్‌లైన్: పవిత్రమైన పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ కూలీని పొడిచి చంపారు. ఈ సంఘటన మండల పరిధిలోని రెడ్డిఘనాపూర్ అనుబంధ గ్రామం కంసన్‌పల్లి మక్తా గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెవుల రాజు(35) స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆయన ఇంటికి స్నేహితులు అంజిలప్ప, వెంకటేష్ వచ్చారు. దీంతో రాజు ఇప్పుడే వస్తానని తండ్రి నర్సప్పకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొడుకు ఆచూకీ కోసం నర్సప్ప అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకుండా పోయింది.
బుధవారం ఉదయం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల వరండాలో రాజు తీవ్ర రక్తగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన గంజాయి ఆశప్ప సమాచారంతో రాజు కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని గుండెలుబాదుకున్నారు. తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్‌ఐ పరమేశ్వర్‌గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. మృతదేహానికి తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కాగా రాజుకు భార్య లక్ష్మి, పిల్లలు నరేష్, అనూష ఉన్నారు. భర్త మద్యానికి బానిసవడంతో లక్ష్మి పిల్లలను తీసుకొని ఆరునెలల క్రితం పుట్టిల్లు అయిన కరన్‌కోట్‌కు వెళ్లింది. భర్త హత్య సమాచారం తెలుసుకున్న ఆమె బుధవారం అత్తారింటికి చేరుకొని కన్నీటిపర్యంతమైంది. తన సోదరుడిని అతడి స్నేహితులు, గ్రామానికి చెందిన అంజిలప్ప, వెంకటేష్‌లు తీసుకెళ్లి చంపేశారని హతుడి సోదరి పద్మ, కుటుంబీకులే ఆరోపించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
పాఠశాలలో పాశవికం..
Published Thu, Jan 16 2014 4:42 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement