రాఘవేంద్ర మృతదేహాన్ని వెలికితీస్తున్న దేవనగర్ వాసులు
కర్నూలు, పగిడ్యాల: పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కేసీ కాలువలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవనగర్ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీలు గుండెపోగు నడిపి ఈశ్వరయ్య, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శివశంకర్ నందికొట్కూరులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడైన రాఘవేంద్ర స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లిన రాఘవేంద్ర.. స్నేహితుడు బోయ పార్థుతో కలిసి సమీపంలోని కేసీ కాలువ గట్టుకు బహిర్భూమికి వెళ్లాడు. కాలకృత్యాలు ముగించుకుని కాలువలో శుభ్రం చేసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయాడు. ఇది గమనించిన స్నేహితుడు పార్థు రక్షించేందుకు చేయి అందించానని పేర్కొన్నాడు. చేయి అందుకున్న రాఘవేంద్ర తనను కూడా నీటిలోకి లాగడంతో భయాందోళనకు గురై విడిచిపెట్టగా మూడు సార్లు పైకి లేచి మునిగిపోయాడని తెలిపాడు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనను గ్రామస్తులైన ముర్తుజావలి, చాకలి శ్రీనివాసులు శివాలయం వద్ద ఒడ్డుకు చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని కన్నీటి పర్యంతమయ్యాడు. పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం చెప్పగానే మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించడంతో హుటాహుటిన దేవనగర్ కాలనీవాసులు తరలివచ్చి కేసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. నందికొట్కూరు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు ఈశ్వరయ్య ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు జలవనురుల శాఖ అధికారులతో మాట్లాడి ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదలను బంద్ చేయించారు. అనంతరం వెదురు బొంగుకు ఇనుప కొక్కాలను కట్టి కేసీ కాలువలో అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో శివాలయం వద్దనే మృతదేహం లభ్యం కావడంతో ఒడ్డుకు చేర్చారు. ఎస్‌ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరుగుదొడ్ల కొరత: పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 268 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురు 163 మంది, బాలికలు 105 మంది ఉన్నట్లు పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి వెల్లడించారు. బాలురకు రెండు, బాలికలకు తొమ్మిది మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో బాలురు మల, మూత్ర విసర్జన చేసేందుకు బయటకు వెళ్తున్నారు. ఉదయం 8.20 గంటలకే పాఠశాలకు వచ్చానని, విద్యార్థులు కేసీ కాలువకు వెళ్లిన సంగతి తనకు తెలియదని ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి తెలిపారు. పాఠశాలలో రెండు మరుగుదొడ్లు వినియోగించుకోవాలని విద్యార్థులకు చెప్పామన్నారు.
కన్నీరు మున్నీరుగావిలపించిన తల్లిదండ్రులు
బడికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన కుమారుడు కొన్ని నిమిషాలకే మత్యువాతకు గురికావడం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘‘రెక్క లు ముక్కలు చేసుకుని పెద్ద చేస్తిమి కదా నాయనా.. అంతలోనే నీకు నూరేండ్లు నిండినాయా తండ్రీ’’ అంటూ తల్లి లక్ష్మీదేవి రోదించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment