వారం రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలు
ఖర్చులపై అయోమయంలో తల్లిదండ్రులు
ప్రైవేటు పాఠశాలల్లో ఆకాశాన్నంటుతున్న ఫీజులు
ఆందోళనలో పేద, మధ్యతరగతి కుటుంబాలు
మంచి యూనిఫాం, టై, షూస్, పుస్తకాల బ్యాగుతో స్కూలుకు వెళ్తున్న ముద్దొచ్చే పిల్లల్ని చూసి మురిసిపోవాలో..? అవన్నీ సమ కూర్చడానికి ఎక్కడ అప్పు చేయాలో..? తెలియక మధ్యతరగతి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. వేసవి సెలవులు ఇచ్చిన ఇన్నాళ్లూ ప్రశాంతంగా నిద్రపోయిన వారి గుండెల్లో ఇప్పుడు గణగణ మంటూ నిద్రలోనూ, మెలకువలోనూ అదే పనిగా స్కూల్ బెల్ మోగు తోంది. దీంతో తల్లిదండ్రులకు జూన్ ఫీవర్ పట్టుకుంది.
విజయనగరం అర్బన్: మరో వారం రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానుండగా... 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. పిల్లల చదువుల కోసం పెట్టాల్సిన ఖర్చులపై ఇప్పటి నుంచే తల్లిదండ్రులు బెంగపెట్టుకుంటున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పులు,
కూరగాయలు, నూనె, పాల ధరలు, కరెంటు బిల్లులు, పెట్రోలు, డీజిల్, బస్సు, రైలు చార్జీలు, సినిమా హాల్ టిక్కెట్ల ధరలు కూడా పెరగడంతో మోయలేని ఆర్థిక భారం పడింది. ఖర్చు ఎక్కువ... జీతం తక్కువ..కావడంతో అప్పులతో బతుకుబండి లాగిస్తున్న మధ్యతరగతి కుటుంబీకులకు జూన్ నెల ఆర్థిక పరీక్షగానే మారుతోంది. స్కూల్ ఫీజులు, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బస్సు, ఆటో చార్జీల భారం మళ్లీ ఒక్కసారిగా ఆరంభం కావడంతో ఆర్థికంగా ఎలా అధిగమించాలా అనే అంశంపై తల్లిదండ్రులు అల్లాడుతున్నారు.
చుక్కలనంటుతున్న ఫీజులు..
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. సౌకర్యాల మాట ఎలా ఉన్నా... ఫీజులు ఏడాదికేడాది కనీసం 10 శాతం పెరుగుతున్నాయి. ఒక్కో పాఠశాలలో సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు.
పాఠ్యపుస్తకాల భారం..
పాఠశాలలు ఆరంభం కాగానే మొదటి ప్రాధాన్యం పుస్తకాల కొనుగోలుదే. ఒకటో తరగతి నుంచి 5 వరకు ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు పాఠ్యపుస్తకాలు అమలులోకి వస్తాయి. 5వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌తో కలిపి రూ.రెండు వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చవుతాయి.
యూనిఫాం...
ఒక్కో పాఠశాల ఒక్కో రకమైన యూనిఫాంను రూపొందించాయి. యూనిఫాంల ధరలు రూ. 450 నుంచి రూ. 1000 వరకు ప్యాంటు, షర్టుతో కలిపి ఉన్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు అక్కడే విక్రయిస్తున్నారు. రెడీమేడ్ యూనిఫాంలు కూడా మా ర్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.
పెరుగుతున్న బ్యాగుల ధరలు...
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు వాటిని మోసే బ్యాగుల ధరలు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నాయి. సంవత్సరంలో రెండు బ్యాగులు తప్పనిసరయ్యాయి. పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బ్యాగులు వాటిని మోయలేక ఎప్పుడు తెగిపోతాయోమోనన్న పరిస్థితిలో ఉంటాయి. అందుకే ఏటా పాఠశాల ఆరంభంలోనే కొత్త బ్యాగులు కొనడం తప్పనిసరి. ఒక్కో బ్యాగు రూ. 350 నుంచి రూ.700 వరకు ఉంటుంది. వీటితోపాటు కంపాక్స్ బాక్స్. పెన్నులు, పెన్సిల్ తదితర ఖర్చులు ఉండనే ఉన్నాయి.
బూట్లు... టై..సైకిల్..
విద్యార్థులు పెరగడం, పాత బూట్లు సరిపోకపోవడం వంటి కారణాల వల్ల తప్పనిసరిగా కొత్తవి కొనుక్కోవాలి. ఒక్కో స్కూల్ యూనిఫాం బూట్లు రూ.450 నుంచి రూ. 600 వరకు ధరపలుకుతున్నాయి. ఆయా పాఠశాలల్లో యాజమాన్యాలే టైలను విక్రయిస్తాయి. ఒక్కోటై రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది.
గుండె నిండా..బడిగంటలు
Published Sun, Jun 7 2015 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement