- జిల్లాలో 200కుపైగా గుర్తింపు లేని పాఠశాలలు
- స్కూళ్లలో ఫీజు బోర్డులూ లేవు
- నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు శూన్యం
- ఉదాసీనంగా విద్యాశాఖ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మూడు, నాలుగేళ్లుగా ప్రభుత్వ ప్రారంభ అనుమతి, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలకు తోడు తాజాగా వీధికి ఒకటి చొప్పున గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నా విద్యాశాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. మొక్కుబడి తంతుగా వారికి నోటీసులు జారీ చేయడంతోనే తమపని పూర్తయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గుర్తింపు లేని పాఠశాలల విషయంలో కలెక్టర్ ఆదేశాలను సైతం విద్యాశాఖాధికారులు అమలు చేయడం లేదు. జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొందరు అధికారులు అమలు చేయని పరిస్థితి జిల్లాలో నెలకొంది.
నిబంధనలివీ...
- ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలలు కచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. కొత్తగా ప్రారంభించిన పాఠశాలలకు ముందుగా పాఠశాల ప్రారంభ అనుమతి తీసుకోవాలి.
- పభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాఠశాలకు ఉండాల్సిన అన్ని వసతులు కల్పించి సంబంధిత అధికారుల నుంచి అన్ని ధ్రువీకరణ పత్రాలు పొంది గుర్తింపు తీసుకోవాలి.
జిల్లాలో జరుగుతోందిదీ...
- కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రారంభ అనుమతి, ప్రభుత్వ గుర్తింపు లేకుండా యథేచ్ఛగా పాఠశాలలు నిర్వహిస్తున్నా విద్యాశాఖాధికారులు వారి జోలికి వెళ్లడం లేదు.
- జిల్లాలో సుమారు 200 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారు. పొరుగు జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖాధికారులు కొరడా ఝుళిపించి పాఠశాలలను మూసివేయిస్తున్నా జిల్లాలోని విద్యాశాఖాధికారుల్లో స్పందన లేదు.
- గుంటూరు జిల్లాలో గతవారం 30 గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలను అక్కడ డీఈవో మూసివేయించారు. జిల్లాలో ఇప్పటి వరకు కనీసం ఒక పాఠశాలపై కూడా గట్టి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
- ఒంగోలు నగరంలోని 33 పాఠశాలలు ఎటువంటి అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్నారు. వీటిల్లో 18 పాఠశాలలకు రూ.15.5 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ 18 పాఠశాలల్లోనే 8 పాఠశాలలకు గత విద్యాసంవత్సరంలో కూడా సుమారు రూ.8 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అయితే వారు పైసా కూడా జరిమానా కట్టకుండా పాఠశాలలను యథావిధిగా నిర్వహించినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్న సాహసం విద్యాశాఖాధికారులు చేయలేదు.
కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరు:
విద్యాశాఖాధికారులు కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కైనందు వల్లే గుర్తింపు లేని పాఠశాలలు యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ సైతం గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, వెంటనే మూసివేయించాలని డీఈవోని ఆదేశించారు. ఆ మేరకు డీఈవో బి.విజయభాస్కర్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తింపులేని పాఠశాలలన్నింటికీ నోటీసులు జారీ చేసి మూసివేయించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం గుర్తింపు లేని పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కూడా పెట్టి 25వ తేదీ లోపు ఎంఈవోలు తీసుకున్న చర్యలపై తనకు నివేదిక సమర్పించాలని డీఈవో ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. పాఠశాలల్లో దుకాణాలు పెట్టి స్కూలు బ్యాగులు, బూట్లు విక్రయించే వారికి కూడా నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలను కూడా బోర్డుల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. డీఈవో జారీ చేసిన ఉత్తర్వుల మీద కూడా క్షేత్రస్థాయి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి.
డీఈవో వివరణ
గుర్తింపు లేని పాఠశాలల విషయమై జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్‌ను వివరణ కోరగా ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలన్నింటినీ మూసివేయిస్తామని తెలిపారు.
చర్యలేవీ..
Published Fri, Jul 4 2014 1:46 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement