సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఇటీవల మూడు దశల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన(ప్రేరణ)లు మొక్కుబడిగా సాగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఉపాధ్యాయుల చేతివాటంతో అనుకున్న స్థాయిలో విద్యార్థులు పాల్గొనలేదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ప్రేరణ(ఇన్‌స్పైర్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మూడేళ్లుగా అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని గత యేడాది జాతీయస్థాయిలో కూడా అవార్డు సాధించింది.
ఓ వైపు విద్యార్థులు సృజనాత్మకత చాటుతున్నా, మరోవైపు ఉపాధ్యాయుల నిర్లిప్తత, చేతివాటం పథకం అమలుకు తీవ్ర అడ్డంకిగా మారాయి. ప్రేరణ కార్యక్రమంలో భాగంగా ఈ యేడాది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1,276 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.5 వేలు విలువ చేసే వారెంట్లు(చెక్కులు) జారీ చేశారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో వారెంట్లను నగదుగా మార్చుకునే వీలు కల్పిస్తూ వారెంట్లు అందజేశారు. అయితే విద్యార్థుల పేరిట జారీ అయిన వారెంట్లను ప్రధానోపాధ్యాయులే వెళ్లి నగదుగా మార్చారు. జిల్లాలో విద్యార్థులకు జారీ చేసిన వారెంట్ల విలువ రూ.63.80 లక్షలు. ఇటీవల మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట డివిజన్ కేంద్రాల్లో జిల్లా వైజ్ఞానిక సదస్సులు నిర్వహించారు.
మొత్తం 1,276 మంది విద్యార్థులు తమ నమూనాలతో హాజరు కావాల్సి వుండగా, 1,181 మంది మాత్రమే వైజ్ఞానిక ప్రదర్శనకు హాజరయ్యారు. 91 మంది గైర్హాజరయ్యారు. దీంతో రూ.4.55 లక్షలు విలువ చేసే వారెంట్లను నగదుగా మార్చుకున్నా, నమూనాలు మాత్రం ప్రదర్శించలేదు. ఒక్కో విద్యార్థికి ఇచ్చే నగదులో రూ.2,500 నమూనా తయారీకి, మరో రూ.2,500 ప్రయాణ భత్యాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రదర్శనలో పెట్టిన నమూనాల్లో 10 శాతం రెడీమేడ్ నమూనాలు వున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరో 30 నుంచి 40 శాతం మేర మొక్కుబడి నమూనాలు ఉన్నట్లు సమాచారం. గత యేడాది కూడా ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌కు దూరం గా ఉన్న 56 పాఠశాలల నుంచి నేటికీ నిధులు రికవరీ చేయలేదు.
నోటీసులు జారీ చేస్తాం: డీఈఓ రమేశ్
ఇన్‌స్పైర్ ప్రదర్శనకు గైర్హాజరైన పాఠశాలలు, ఉపాధ్యాయుల నుంచి వివరణ కోరుతూ ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ రమేశ్ ‘సాక్షి’కి వెల్లడించారు. త్వరలో తుది నోటీసు పంపి నిధులు రికవరీ చేస్తామని తెలిపారు.
సంజాయిషీ ఇవ్వని ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. ఈ యేడాది జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 89 నమూనాలు ఎంపిక కాగా, ఇందులో 75 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించినవే ఉన్నట్లు రమేశ్ వెల్లడించారు.
వైజ్ఞానిక ప్రదర్శనకు 91 మంది దూరం
Published Sat, Aug 24 2013 1:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement