అరణ్య రోదన | Screaming in forest | Sakshi
Sakshi News home page

అరణ్య రోదన

Published Mon, Nov 17 2014 2:49 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

Screaming in forest

సాక్షి ప్రతినిధి, కడప : పసి హృదయాలు గాయపడ్డాయి. అండగా నిలవాల్సిన యంత్రాంగం నిద్రమత్తు వదలడం లేదు. అన్నపానీయాలు మానేసి 8 కిలోమీటర్లు మేర రెండు పర్యాయాలు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట బైటాయింపు చేపట్టారు. చలించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.

పెపైచ్చు హుంకరింపులకు పాల్పడుతోంది. నాయుడు బ్రదర్స్ తెరవెనుక కనుసైగలతో ప్రత్యక్ష ఆందోళన సైతం నిష్ర్పయోజనమే అవుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయంతో నెలకొల్పిన స్పోర్ట్స్ స్కూల్ ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ మెరుగైన ఆటలతోపాటు విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు బహిర్గతమయ్యాయి.

వెనువెంటనే ఆందోళనలు సైతం ఉత్పన్నమయ్యాయి. దీంతో పరిశ్రమల జీఎం గోపాల్, డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు నేతృత్వంలో ద్విసభ్య కమిటీని విచారణకు ఆదేశించారు. ఆ క మిటీ ఆరోపణలు మినహా ఆధారాలు లేవని తేల్చింది.  

 సూపర్‌వైజర్లపై ఆగ్రహం
 కాస్మోటిక్ ఛార్జీలు అందించకుండా నెలకు సుమారు రూ.60వేలు భోంచేస్తున్నారని ఇరువురు సూపర్‌వైజర్ల మీద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ట్రాక్‌షూ ఇవ్వకుండా వేధిస్తుండటం, విద్యార్థులకు వచ్చిన పథకాలను స్వాహా చేస్తుడటంలాంటి చర్యలతో  విద్యార్థులు విసిగిపోయినట్లు సమాచారం. ప్రభుత్వమే విద్యార్థులకు ఇన్సూరెన్సు చేయాల్సి ఉంది.

అలా చేయకపోగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.1200 వసూలు చేసి ఆ మొత్తంతో కూడా ఇన్సూరెన్సు చేయకుండా నొక్కేసిన ఘనపాటిలుగా ఆ ఇరువురు సూపర్‌వైజర్లు నిలుస్తున్నారు. ఇన్సూరెన్సు వ్యవహారం ఁసాక్షి* బహిర్గతం చేయడంతో విద్యార్థుల నుంచి రాబట్టిన సొమ్ము రూ.1.84 లక్షలు సూపర్‌వైజర్ల నుంచి రికవరీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని నియంత్రించాల్సిన యంత్రాంగం ఉపేక్షిస్తోంది. ఇందుకు తెరవెనుక జిల్లాలోని నాయుడు బ్రదర్స్ కారణంగా తెలుస్తోంది.  

 విద్యార్థులపై ఎదురుదాడి సబబేనా?
 స్పోర్ట్సు స్కూల్ విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపాల్సిన యంత్రాంగం వారిపైనే ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. డీఆర్వో సులోచన, జాయింట్ కలెక్టర్ రామారావు విద్యార్థులకు హామీ ఇచ్చి, ఆచరణలో చర్యలకు వెనుకంజ వేశారు.

దీంతో మరోమారు విద్యార్థులు ర్యాలీ చేపట్టి ప్రత్యక్ష ఆందోళన చేశారు. ఇవేవీ గ్ర హించకుండా విద్యార్థులచే ఎవరు  చేయిస్తున్నారో తెలుసు అనడం ఎంతవరకూ సమంజసమని పలువురు నిలదీస్తున్నారు. వాస్తవానికి విద్యార్థుల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ అనుబంధ  విద్యార్థి సంఘం అయిన టీఎన్‌ఎస్‌ఎఫ్ కూడా  మద్దతు పలికింది.

 బాధ్యతల నుంచి తప్పుకుంటున్న స్పెషల్ ఆఫీసర్
 స్పోర్ట్సు స్కూల్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు తన రాజీనామాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ధ్రువీకరించేందుకు డిప్యూటీ డీఈఓ ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లారు.

కాగా స్పెషల్ ఆఫీసర్‌గా డీఎస్‌డీఓ బాషామోహిద్ధీన్‌ను నియమించనున్నట్లు సమాచారం. అయితే స్పోర్ట్సుస్కూల్‌లో ఇద్దరు టీచర్లును తప్పించే లా చర్యలు తీసుకుంటేనే  బాధ్యతలు అప్పగిస్తామనే మెలిక పెట్టినట్లు సమాచారం. ఆ మేరకు బాధ్యతలు తీసుకునేందుకు డీఎస్‌డీఓ వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement