కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీల తిరుగుబాటు
హైదరాబాద్: రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ సారి ఎస్సి, ఎస్టి, బిసి వర్గాల వారు ఆందోళనకు దిగారు. ఎస్సీ,ఎస్టీ వారు ఏకమై తిరుబాటుకు సిద్ధపడటం విశేషం. నాలుగవ అభ్యర్థిగానైనా తమ వర్గంవారిని ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుపడుతున్నారు. తమలో ఒకరిని బరిలోకి దింపేందుకు కూడా వారు సిద్ధమవుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోజు ఏఐసీసీ పరిశీలకులతో సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ సంఘానికి ఒక రాజ్యసభ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అభ్యర్థిని మారుస్తారా? లేక నాలుగో అభ్యర్థిగా అవకాశమిస్తారా? అనేది పార్టీ అధిష్టానవర్గంతో మాట్లాడి చెప్పాలన్నారు. మంత్రులు బాలరాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్, కొండ్రు మురళి తదితరులు ఏఐసీసీ పర్యవేక్షకుడిని కలిసి నాలుగో అభ్యర్థిగా ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఐసీసీ పరిశీలకులు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు అన్యాయం జరిగింది వాస్తవమేనని అంగీకరించారు. ఈసారికి వదిలేయండని బొత్స వారిని కోరారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఎస్సీ, ఎస్టీ మంత్రులకు సోనియా గాంధీతో అపాయింట్‌మెంట్ ఇప్పించి, పరిస్థితిని చెప్పే అవకాశం కల్పిస్తామని ఏఐసీసీ పరిశీలకులు వారికి చెప్పారు. నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు ఎంఎల్‌సీలుగా అవకాశమివ్వాలని అధిష్టానవర్గానికి సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు.