తూర్పు.. తూర్పు.. దొంగ ఓటర్ల కూర్పు
అనగనగా ఓ ఇల్లు.. ఆ ఇంట్లో వాస్తవంగా ఉండేది ఇద్దరే. కానీ ఓటర్ల జాబితా ప్రకారం.. ఆ ఇంట్లో ఏకంగా 35 మంది ఉంటున్నారట!.. ఉండటమే కాదు.. గత ఎన్నికల్లో ఓట్లు కూడా వేసేశారు. త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల్లోనూ ఓట్లేయడానికి సన్నాహాలు చేస్తున్నారు!ఆ ఎదురుగానే మరో ఇల్లు.. అక్కడా ఉండేది ఇద్దరే.. కానీ వారికి తెలియకుండా మరో ఏడుగురు ఉంటున్నట్లు ఓటర్ల జాబితా చెబుతోంది. ఇదెలా సాధ్యం అనుకోకండి.. తెలుగుదేశం నేతలు తలచుకుంటే.. ఇలాంటి దొంగాటకాలు ఎన్నయినా సాధ్యమే.
ఎన్నికల్లో విజయం కోసం లేని ఓటర్లను సృష్టించి వారి పేరుతో ఓట్లు గుద్దేస్తున్నట్లు ఓటర్ల జాబితాపై ఒట్టేసి మరీ చెప్పొచ్చు..
విశాఖపట్నం: ఎన్నికల్లో విజయానికి ఓటర్లుండాలి. అభ్యర్థులు, పార్టీలు వారి ఆదరణ పొందాలి. కానీ ప్రతిదానికీ అడ్డదారులు తొక్కడం అలవాటైన తెలుగుదేశం నేతలు ఈ విషయంలోనూ అదే పని చేశారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించి.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. మనుషులు లేకపోయినా ఇప్పటికీ ఆ దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో అలాగే కొనాసాగుతున్నాయి. ఇంకేముంది త్వరలో జరగనున్న మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల్లోనూ ఈ దొంగ ఓట్ల మద్దతుతో పీఠం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఇటువంటి దొంగ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల వారిని ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్పించారు. ఇక్కడి ముఖ్యనేతలు తమకు నమ్మకస్తులైన ’దేశం’ నేతల ఇళ్ల చిరునామాలతో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒక్కో డోరు నంబరులో 30 నుంచి 40 మందిని ఓటర్లుగా రాయించేశారు.
ఆరా తీయని అధికారులు
ఒకే డోరు నంబరు ఇంట్లో ఇంతమంది నివసించడం సాధ్యమా? అన్న అనుమానం ఏ ఒక్క అధికారికీ రాకపోవడం.. కనీసం ఆ దిశగా ఆరా తీయకపోవడం కూడా విడ్డూరమే. ఈ అక్రమాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇంకేముంది.. ఎక్కడెక్కడివారో ఇక్కడ ఓటర్ల అవతారమెత్తారు. గత ఎన్నికల్లో టీడీపీకి గంప గుత్తగా ఓట్లు కూడా వేసేశారు. ఇలా విశాఖ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 35 వేల మంది స్థానికేతరులను టీడీపీ నాయకులు ఓటర్ల జాబితాలో చేర్పించారని తెలుస్తోంది.
జీవీఎంసీ ఒకటో వార్డు ఆరిలోవ ప్రాంతంలో టీడీపీ నాయకుడు నీలి అప్పలరాజు ఉంటున్న 16–887 ఇంటి నంబరుతో ఏకంగా 35 మంది ఓటర్లను చేర్చారు. వాస్తవానికి ఆ ఇంట్లో ఇద్దరంటే ఇద్దరే ఉంటున్నారు. ఆ ఇంట్లో మహా అయితే ఏడెనిమిది మంది ఓటర్లకు మించి నివసించే అవకాశమే లేదు. కానీ 35 మంది ఓటర్లు ఆ ఇంట్లో ఉంటున్నట్టు ఓటర్ల జాబితా స్పష్టం చేస్తోంది.
అదే ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లోనూ ఇద్దరే ఉంటున్నారు. కానీ ఆ ఇంటి డోరు నంబరు(16–893) తో తొమ్మిది మంది ఓటర్లను జాబితాలో చేర్చేశారు. కానీ ఆ విషయం ఆ ఇంట్లో వారికి తెలియనే తెలియదు.
ఇలాంటి అక్రమాలు ఆ నియోజకవర్గంలో కోకొల్లలుగా జరిగాయని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 252 పోలింగ్ బూత్‌లున్నాయి. ప్రతి బూత్‌లోనూ వందకు పైగా ఇలాంటి దొంగ ఓటర్లను చేర్చినట్టు అంచనా. దీనిపై అప్పట్లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా మొక్కుబడిగా కొంతమంది దొంగ ఓటర్లను తొలగించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా ప్రకారం తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించినా సంబంధిత బూత్ లెవల్ అధికారులు, బిల్లు కలెక్టర్లు ఆ పని చేయలేదు. దీంతో ఎన్నికలు సమీపించే సరికి మళ్లీ యధావిధిగా జాబితాలో వారు ప్రత్యక్షమయ్యారు. దొంగ ఓట్లను ఏరికోరి చేర్పించిన టీడీపీ నాయకులే ఎన్నికల్లో వీరందరిని ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు.