'సత్యం రాజు' బృందం రూ.1850 కోట్లు చెల్లించాలి: సెబి
ముంబై: సత్యం కంప్యూటర్స్ సంస్థ వ్యవస్థాపకుడు బి.రామలింగ రాజు, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్లు నలుగురు 1850 కోట్ల రూపాయలు చెల్లించాలని సెబి ఆదేశించింది. దేశంలోనే అతి పెద్ద కార్పోరేట్ మోసంగా పేరుపడిన దీనిపై అయిదున్నర సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాలపై 14 ఏళ్లు నిషేధం కూడా విధించారు. ఈ డబ్బుకు 2009 జనవరి 7 నుంచి ఏడాదికి 12 శాతం వడ్డీతో 45 రోజులలోపల సెబికి చెల్లించాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.
కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని రాజలింగ రాజు స్వయంగా అంగీకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రామలింగ రాజుతోపాటు అతని సోదరుడు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.రామరాజు, సంస్థ మాజీ సిఎఫ్ఓ వడ్లమూడి శ్రీనివాస్, మాజీ వైస్ ప్రసిడెంట్ జి.రామకృష్ణ, సంస్థ అంతర్గత ఆడిటింగ్ విభాగం మాజీ చీఫ్ విఎస్ ప్రభాకర గుప్తలకు ఈ ఆదేశాలు జారీ చేశారు.