రెండో రోజు 2,500 మందికే | second day for 2,500 peoples | Sakshi
Sakshi News home page

రెండో రోజు 2,500 మందికే

Published Thu, Jul 3 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

second day  for 2,500 peoples

 అన్నవరం: ప్రభుత్వ పథకాల అమలు తీరుకు రత్నగిరిపై గురువారం ప్రారంభమైన ఐదువేల మందికి అన్నదానపథకం సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. రెండో రోజున ఈ పథకం తగినంత మంది భక్తులు లేక 2,500 మందికే పరిమితమైపోయింది. ఉదయం 10.30 గంటలనుంచి భక్తులకు ఉచిత భోజనం కూపన్లు పంపిణీ చేశారు. దేవస్థానానికి వచ్చిన ప్రతీఒక్కరికీ ఈ కూపన్లు పంపిణీ చేసినప్పటికీ మధ్యాహ్నం 2,200 మాత్రమే భోజనాలు పెట్టారు.

రాత్రికి మరో 300 మందికి భోజనాలు పెట్టారు. మొత్తం మీద 2,500 మందికి మాత్రమే భోజనాలు పెట్టారు. వీరిలో దేవస్థానం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది 300 మంది ఉన్నారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన అన్నదానం పథకం అధికారులు రెండుపూటలూ కలిపి 2,500 మందికి  మాత్రమే వంటలు చేయించారు. ఆషాఢమాసమంతా ఇలాగే ఉంటుందని, మంగళ, శుక్రవారాలలో, అమావాస్య వంటి తిథులలో 1500 మంది భక్తులు భోజనాలు చేయడమే కష్టమని అంటున్నారు. కాగా గురువారం పాత అన్నదానం హాలుతో బాటు కొత్త అన్నదానం హాలులో కూడా భక్తులకు భోజనాలు పెట్టారు.
 
ఐదువేల మందికి భోజనం కొన్ని రోజుల్లోనే సాధ్యం
ప్రతి రోజూ ఐదువేలమంది భక్తులకు అన్నదానం చేయడం సాధ్యం కాని పని అని దేవస్థానం అధికారులు అంటున్నారు. వైశాఖం, శ్రావణం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, మాఘ మాసాలలో, మిగిలిన నెలల్లో శని, ఆదివారాలు, ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలలో మాత్రమే ఐదువేలమందికి భోజనం పెట్టేందుకు సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

భక్తులు రాకపోవడం వల్లే గురువారం 2,500 మంది భక్తులకు మాత్రమే భోజనం పెట్టినట్టు దేవస్థానం ఈఓ వేంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా ఉండగా అన్నదానపథకంలో భోజనాలు ఐదువేల మందికి విస్తరించినందున సిబ్బందిని కూడా పెంచారు. ఆలయ సూపరింటెండెంట్‌గా ఉన్న పెండ్యాల భాస్కర్‌ను అన్నదానం-2 సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయనతో బాటు మరో ఏడుగురు సిబ్బందిని కూడా నియమించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ సూపరింటెండెంట్‌గా ఉన్న బలువు సత్యశ్రీనివాస్‌కు ఆలయ సూపరింటెండెంట్ బాధ్యతలు అదనంగా అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement