
గ్రామ, వార్డు సచివాలయ భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు నేడు రెండో రోజు రాష్ట్ర్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు నేడు రెండో రోజు రాష్ట్ర్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ల పోస్టులకు పరీక్షలు జరుగుతాయి. 2,880 వీఆర్వో, 11,158 సర్వేయర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరుకు 13,540 ఏఎన్‌ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 72,581 అభ్యర్థులు హాజరుకానున్నారు.
పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి...
పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడవని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ 500 బస్సులను ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో అభ్యర్థుల కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.
అభ్యర్థుల అవస్థలు..
విశాఖపట్నం: అరకు పాసింజర్ ఆలస్యంతో..సచివాలయం రాత పరీక్షకు ముందుగా బయలుదేరిన గిరిజన యువత ఇబ్బందులు పడ్డారు. ఉత్తరసింహాచలంలో అర్ధరాత్రి 12 గంటల వరుకు పాసింజర్ నిలిచిపోయింది. చంటి పిల్లల తల్లులు నరకయాతన పడ్డారు.