మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగువిజయంలో గురువారం రెండోరోజు మహానాడులో సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుతమ్ముళ్లే కనిపించారు.
మొయినాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా): మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగువిజయంలో గురువారం రెండోరోజు మహానాడులో సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుతమ్ముళ్లే కనిపించారు. తెలంగాణ జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. మహానాడులో జిల్లా నేతల హడావుడి గతంలో ఎక్కువగా ఉండేది.
టీడీపీని వీడి ప్రజాదరణ కలిగిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో ఈసారి ఇక్కడి నేతల సందడే లేకుండా పోయింది. జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్దగా కనిపించలేదు. మరోవైపు మహానాడుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు తమపేర్లు నమోదు చేసుకోవడానికి ఏ కౌంటర్‌లోకి వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు. ప్రధాన ద్వారం వద్ద ఆయా జిల్లాలవారు నమోదు కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకోవడానికి గతంలో కౌంటర్లను ఏర్పాటు చేసేవారు. ఈసారి అది లేకపోవడంతో వచ్చిన వారు తికమకపడ్డారు.
ఇక సభా ప్రాంగణంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో చాలామంది మధ్యాహ్నానికే తిరుగుముఖం పట్టారు. దప్పిక తీర్చుకోవడానికి తెలుగుతమ్ముళ్లు హిమాయత్‌నగర్ చౌరస్తా, అజీజ్ నగర్ చౌరస్తా సమీపంలోని వైన్‌షాపులకు క్యూ కట్టారు. రెండు రోజులుగా మహానాడు జరుగుతుండడంతో ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అసలే మండే ఎండలు.. ఆపై గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుని నానా అవస్థలు పడ్డారు.