రైల్వేస్టేషన్లలో మూడో కన్ను
రైలు ఇంకా రావాల్సి ఉంటుంది. అందుకు దాదాపు అరగంటకు పైగా సమయం ఉంటుంది. ఈలోపు అక్కడున్న టీవీలో ఏదో మంచి సినిమాపాట వస్తుంటుంది. సరేకదాని దానివైపు మనం తదేకంగా చూస్తుంటే.. ఇంతలో మన పక్కనే నిలబడి టీవీ చూస్తున్నట్లే చూస్తూ జేబులు కొట్టేసే గ్యాంగులు కోకొల్లలు. అలాగే, టికెట్ కౌంటర్ వద్ద రద్దీగా ఉన్నప్పుడు కూడా జేబులు కొట్టేయడం, ఒక టికెట్ కూడా అవసరం లేకపోయినా కొనేసి బయట బ్లాక్లో అమ్ముకోవడం లాంటివి చేసే గ్యాంగులకు కూడా కొదవలేదు. ఇప్పుడు ఇలాంటివాళ్ల ఆట కట్టించడానికి రైల్వే స్టేషన్లలో మూడో కన్ను వచ్చేస్తోంది. స్టేషన్ల ఆవరణలోను, ప్లాట్ఫారాలపైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో ఇప్పటికే ఇవి ఉన్నా.. భీమవరం లాంటి పట్టణాల్లో కూడా ఇప్పుడు ఇవి వచ్చేస్తున్నాయి. భీమవరం టౌన్ రైల్వేస్టేషన్లో శనివారం నాడు ఈ సీసీ కెమెరాలను తొలిసారిగా ఏర్పాటుచేసి, వాటి పనితీరును పరిశీలించారు.
ఇకపై గట్టి నిఘా
ఇటీవల రైల్వే స్టేషన్లు, రైళ్లలో దోపిడీలు ఎక్కువకావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్లలో గట్టి నిఘా పెట్టనున్నారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించనున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా స్టేషన్లలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చనేది రైల్వే అధికారుల ఆలోచన. స్టేషన్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునే వీలుంటుంది.
పలు కెమెరాల ఏర్పాటు
భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌లోని ప్రధాన ద్వారం వద్ద, రిజర్వేషన్, టికెట్ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల తత్కాల్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకునేందుకు కొంతమంది ముఠాగా తయారయ్యారు. నిత్యం క్యూలైన్‌లో కొందరిని నిలిపి, వారి ద్వారా టికెట్లు తీసుకుని ఎక్కువ ధరకు బయట వ్యక్తులకు ముఠా సభ్యులు విక్రయిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇటువంటి చర్య లకు అడ్డుకట్ట పడే అవకాశముంది.