సచివాలయం విభజన కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర పరిపాలనకు కేంద్రబిందువుగా నిలిచే సచివాలయంలో బ్లాకుల విభజన కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండనున్నందున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత సచివాలయం నుంచే పరిపాలన సాగించనున్నాయి. అంటే జూన్ 2వ తేదీ నుంచి సచివాలయం ఒకటే అయినా ఇద్దరేసి ముఖ్యమంత్రులు, ఒకే శాఖకు ఇద్దరేసి మంత్రులు చొప్పున దర్శనమివ్వనున్నారు. సచివాలయంలోని బ్లాకుల్లో కొన్నింటిని తెలంగాణ ప్రభుత్వానికి, కొన్ని బ్లాకులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించనున్నారు. ఈ బ్లాకుల్లో ఎవరికి ఏది కేటాయించాలనే అధికారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు చేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పుచేర్పులతో గవర్నర్ తుదిరూపు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. జూన్ 2 నుంచి సచివాలయం నుంచి రెండు రాష్ట్రాల పాలన సజావుగా సాగడానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందుగానే ఏర్పాటుచేసి సిద్ధంగా ఉంచాలనేది గవర్నర్ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో ఏ బ్లాకు ఎవరికి కేటాయించాలనే దానిపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు.
ఆ వివరాలివీ..
ప్రస్తుతం సీఎం కార్యాలయమున్న సి బ్లాక్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, సీఎస్‌కు, సీఎం కార్యాలయ కార్యదర్శులకు కేటాయించనున్నారు. అలాగే తెలంగాణ ఉద్యోగులకు సచివాలయంలోని సి బ్లాక్‌తోపాటు ఏ, బి, డి, నార్త్ హెచ్ బ్లాక్‌లను కేటాయించనున్నారు. తెలంగాణ సీఎం, మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు హెలిపాడ్ సమీపంలో గల స్కూల్ వద్ద గేట్ల నిర్మాణం చేయనున్నారు.
సీమాంధ్ర సీఎంకు గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సౌత్ హెచ్ బ్లాక్‌ను కేటాయించనున్నారు. ఈ బ్లాక్‌లో మూడో అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. అలాగే కింద అంతస్తులో సీమాంధ్ర సీఎస్ కార్యాలయాన్ని, రెండో అంతస్తులో సీఎం కార్యాలయ అధికారులకు కేటాయిస్తారు. అక్కడే మంత్రివర్గ సమావేశ మందిరాన్నీ ఏర్పాటు చేస్తారు. సీమాంధ్ర సీఎం, మంత్రులు, ఉద్యోగులు ప్రస్తుతమున్న గేటు ద్వారా రాకపోకలు కొనసాగించనున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు, మంత్రులకోసం జె, ఎల్, కె బ్లాకుల్ని కేటాయించనున్నారు.
ప్రస్తుతం గ్రీన్‌లాండ్స్‌లో గల ముఖ్యమంత్రి అధికార నివాసం, క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ సీఎంకు కేటాయిస్తారు. సీమాంధ్ర ముఖ్యమంత్రికి గ్రీన్‌లాండ్స్ అతిథిగృహాన్ని కేటాయించనున్నారు. ఈ కేటాయింపుల ఆధారంగా రహదారులు-భవనాల శాఖ ఆయా బ్లాకుల్లో చిన్న చిన్న నిర్మాణాలను చేయాల్సి ఉంది.