డెకాయ్ పార్టీలతో దొంగలకు చెక్
సాక్షి, నెల్లూరు : భద్రతా సిబ్బంది కొరత, అధిక పనిభారం, ఉదాశీనత.. కారణాలు ఏవైనప్పటికీ ఇటీవల కాలంలో పలు రైళ్లలో దోపీడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, బ్యాగ్ లిఫ్టింగ్‌లు అధికమయ్యాయి.
అదును చూసి దుండగులు తమ పంజా విసురుతున్నారు. రైళ్లల్లో ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకు ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బంది ఉన్నారు. అయితే కొద్ది కాలంగా ఈ విభాగంలో భద్రతా సిబ్బంది నియామకం తగ్గింది. అదే సమయంలో రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగాయి. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు ఆర్పీఎఫ్ గస్తీ తిరుగుతుంటారు.
అయితే ఒక రైలుకు ఇద్దరు ముగ్గురు సిబ్బందిని భద్రత కోసం పంపిస్తుండటంతో వారు పూర్తి స్థాయిలో గస్తీ తిరగలేకపోతున్నారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రత్యేక రైళ్లలో గస్తీ తిరిగే పరిస్థితి లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని దుండగులు రైలు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఇటీవల కొడవలూరు మండలం తలమంచి వద్ద దుండగులు పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఇటీవల రైళ్లలో వరుస దోపిడీలు ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు, సిబ్బందికి కం టి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలాగైనా నేరస్తుల ఆట కట్టించేందుకు రాష్ట్ర స్థాయిలో పోలీసు అధికారులు పకడ్బం దీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న రైల్వేపోలీసు విభాగానికి అదనంగా ప్రతి జిల్లాకు 20 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితో పాటు మొబైల్ పార్టీలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఏపీఎస్పీకి చెందిన ఒక ప్లటూన్ సిబ్బందిని కూడా కేటాయించారు.
రైళ్లలో డెకాయ్ విభాగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు రైళ్లల్లో దోపీడీ దుండగలు ఆట కట్టేందుకు డెకాయ్ విభాగాలు ఏర్పాటు చేయాలని గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పీ ఎస్‌జే జనార్దన్ నిర్ణయించారు. ఈ డివిజన్ పరిధిలోని ఏడు జిల్లాల్లో కొత్తగా డెకాయ్ పార్టీలను నియమించారు. నెల్లూరు సబ్ డివిజన్‌లో చెన్నై మార్గంలో తడ, తిరుపతి మార్గంలో శ్రీకాళహస్తి వరకు, విజయవాడ మార్గంలో స్టూవర్ట్‌పురం వరకు ఈ డెకాయ్ పార్టీలను సమర్థవంతంగా నిర్వహించేలా నెల్లూరు రైల్వే డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ చర్యలు చేపట్టారు. డెకాయ్ పార్టీలంటే.. రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది గస్తీతో సంబంధం లేకుండా కొన్ని రైళ్లలో పోలీసు అధికారులు ప్రత్యేకంగా కొందరు మహిళలు, పురుషులను ప్రయాణికుల్లా పంపుతారు. వారు అధికంగా బంగారు ఆభరణాలను ధరించి రైళ్లలో కిటికీల పక్కనే కూర్చుని ప్రయాణిస్తూ నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు.
వారితో పాటు సమీపంలో మరో ఇద్దరు ముగ్గురు సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు నిఘా ఉంచుతారు. నేరస్తుడు వారిని సాధారణ ప్రయాణికుల్లా భావించి నేరాలకు పాల్పడితే వారిని పట్టుకోవడం లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాల్చి వేస్తారు. ఓ వైపు రైళ్లలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, బ్యాగ్ లిఫ్టింగ్‌లకు పాల్పడిన పాత నేరస్తుల వేటలో ఉంటూ మరో వైపు కొందరు అదనపు సిబ్బందిని ఈ డెకాయ్ పార్టీలో సభ్యులుగా చేర్చారు. అదనపు సిబ్బంది రాకతో రాత్రి వేళల్లో అన్ని రైళ్లలో (స్పెషల్ రైళ్లతో పాటు) ఆయుధాలు కలిగిన పోలీసు అధికారులు, సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. ఓ వైపు గస్తీ నిర్వహిస్తూనే మరో వైపు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ, రైల్వే ఫ్లాట్‌ఫాంలపై తనిఖీలు నిర్వహించనున్నారు.
భద్రత కల్పిస్తాం : డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్
ప్రయాణికులకు అన్ని విధాలా భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. కొత్తగా సిబ్బంది కేటాయింపుతో కొరత కూడా తీరింది. ఇటీవల బిట్రగుంటకు చెందిన పాత నేరస్తుడు (బ్యాగ్ లిప్టర్) అనిల్‌కుమార్‌ను అరెస్ట్ చేసి 250 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాం. గూడూరు వద్ద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పాతనేరస్తుడు (చైన్‌స్నాచర్)ను కూడా అరెస్ట్ చేశాం. రైళ్లలో ప్రయాణించే మహిళలు నేరాలు జరిగేందుకు ఆస్కారం ఇవ్వకూడదు. సహ ప్రయాణికులు ఇచ్చే కూల్‌డ్రింక్‌లు, తినుబండారాలు, మంచి నీటిని సైతం తిరస్కరించాలి. ప్రయాణికులను చైతన్య వంతులను చేయడం, అప్రమత్తం చేసే చర్యలతో పాటు రైలు పట్టాలు దాటేటప్పుడు, రైలు దిగేటప్పుడు తదితర సందర్భాల్లో జరిగే ప్రమాదాలపై మేము ప్రత్యేకంగా ఒక షార్ట్ ఫిల్మ్‌ను చిత్రీకరించాం. ప్రస్తుతం దాన్ని రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాంలపై ఉండే టీవీల్లో ప్రదర్శిస్తున్నాం.