ఢిల్లీ: ఏపీ భవన్‌లో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. ఈరోజు రాత్రి 8 గంటలకు వారు ఆంటోనీ కమిటీని కలవనున్నారు. ఆ కమిటీకి అందించే నివేదికపై వారు చర్చిస్తున్నారు. విభజన కారణంగా రెండు ప్రాంతాలకు జరిగే నష్టాలను వివరించాలన్న ఆలోచనతో వారు ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు జరిగేనష్టాలతోపాటు పార్టీకి జరిగే నష్టాన్ని కూడా వారు కమిటీకి తెలియజేస్తారు. రాష్ట్రాన్ని విభజించినట్లయితే తమిళనాడులో మాదిరి కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండవని వారు చెప్పదలచుకున్నారు. ఒకవేళ విభజన తప్పనిసరైతే కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణలో కలపాలని ఆ జిల్లాల నేతలు కోరనున్నారు. మళ్లీ రాయల-తెలంగాణ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
సమైక్యం సాధ్యం కాకుంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యక్తం చేస్తున్నారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, ఒకవేళ విభజించవలసివస్తే రాయల-తెలంగాణ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కోరుతున్నారు. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని పలువురు సీమాంధ్ర నేతలు కోరుతున్నారు.
ఇంతకు ముందు పలువురు సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. వారు కూడా కమిటీకి చెప్పే విషయాలనే చర్చించినట్లు తెలుస్తోంది. సిఎంను కలిసిన వారిలో ఎంపిలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ ఉన్నారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ని కలిశారు. ఆంటోనీ కమిటీకి చెప్పవలసిన విషయాలను వారు చర్చిస్తారని తెలుస్తోంది. సీమాంధ్ర నేతలు కలిసిన తరువాత రాత్రి 9 గంటలకు ఆంటోనీ కమిటీని సిఎం ప్రత్యేకంగా కలుస్తారు.
ఏపి భవన్లో సీమాంధ్ర నేతల సమావేశం
Published Tue, Aug 20 2013 7:24 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
Advertisement