మొదటి వారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం
రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు వచ్చే నెల మొదటి వారంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరం సమావేశం కానున్నట్టు మంత్రి శైలజానాథ్ తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
భవిష్యత్‌లోనూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశంపైనే ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎప్పుడు ఎక్కడ సమావేశం ఉంటుందన్న వివరాలను తరువాత తెలియజేస్తామన్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉంచడానికి తాము సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తామని, అందులో విజయం సాధిస్తామని తమకు గట్టి నమ్మకం ఉందన్నారు.
56 రోజులలో ప్రక్రియ ఏమి ముందుకెళ్లింది?: మంత్రి గంటా
తెలంగాణ విభజన ప్రక్రియ నుంచి కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. అందరూ అవే మాటలు చెబుతున్నారు తప్పితే.. సీడబ్లూసీ నిర్ణయం తీసుకొని ఇప్పటికి 56 రోజులవుతుందని, ఇన్ని రోజులలో ఆ ప్రక్రియ ఏమైనా ముందుకెళ్లిందా అని ప్రశ్నించారు. పదో ఇరువై సార్లు మాత్రం నోట్ తయారవుతుందంటూ ప్రకటనలు మాత్రం వచ్చాయన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాము నమ్ముతున్నామని చెప్పారు.