పరిపాలనకు ‘సమైక్య’ బ్రేక్
Published Fri, Feb 7 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
సాక్షి, కాకినాడ :రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీఓల సంఘం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు జిల్లాలో ప్రభుత్వోద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. దీంతో కలెక్టరేట్ సహా దాదాపు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూత పడ్డాయి. కీలకమైన రెవెన్యూ సహా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో జిల్లాలో గురువారం నుంచి పరిపాలన స్తంభించిపోయింది. ఆర్డీఓ, తహశీల్దార్, వీఆర్వో కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. మండల పరిషత్ కార్యాలయాలు తెరుచుకోలేదు. పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, కమర్షియల్, రవాణా, ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, జెడ్పీ, దేవాదాయ, పశు సంవర్ధక, విద్య, వైద్య-ఆరోగ్య, గ్రంథాలయ, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. ఎక్సైజ్ మినిస్టీరియల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నారు.
పలుచోట్ల నిరసన ప్రదర్శనలు
జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్
అసోసియేషన్ కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు సుబ్బారావు కలెక్టరేట్ గేట్లకు తాళాలు వేసి, సిబ్బందితో కలిసి ఆ ప్రాంగణంలో ర్యాలీ చేశారు. పౌర సరఫరాలు, డ్వామా, బీసీ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఈ ర్యాలీలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు.
పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా కన్వీనర్ మల్లు సత్యనారాయణ మూర్తి, కో కన్వీనర్ కె.రామకృష్ణారావు ఆధ్వర్యంలో మినిస్టీరియల్ సిబ్బంది పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌ల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు ప్రదర్శన చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక దీక్షా శిబిరంలో చెవులు, కళ్లు, నోరు మూసుకొని యూపీఏ తీరుపై నిరసన తెలిపారు. కలెక్టరేట్ గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.
పీఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట మానవహారం, ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బూరిగా ఆశీర్వాదం, త్రినాథ్‌లు మాట్లాడుతూ రాష్ర్ట విభజన బిల్లును అసెంబ్లీలో మాదిరిగానే పార్లమెంటులో కూడా తిరస్కరించేలా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కృషి చేయాలన్నారు. విభజన బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించని ఎంపీలు, మంత్రులను నియోజకవర్గాల్లో తిరగనివ్వబోమని, వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని అన్నారు. విభజన బిల్లును తిరస్కరించడం ద్వారా ఈ నెల 21న కాకినాడలో అశోక్‌బాబు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించుకుందామని చెప్పారు.
రాజమండ్రిలో ఏపీఎన్జీఓ కార్యాలయం నుంచి ఉద్యోగులంతా బైక్ ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
అమలాపురంలో ఏపీఎన్జీఓలు ప్రదర్శన చేశారు. ఈ నెల 10న జరగనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసేందుకు ఎన్జీఓ నేతలు ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఇంకా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రదర్శనలు, మానవ హారాలు నిర్వహించారు.
Advertisement
Advertisement