Seemandhra employees
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సచివాలయ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. గురువారం భోజన విరామ సమయంలో సచివాలయంలోని ధర్నాచౌక్ వద్ద తమ నిరసనను తెలియజేశారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాలని, సిగ్గులేని సీమాంధ్ర మంత్రులను సంఘ బహిష్కరణ చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ విభజన బిల్లుకు సంబంధించిన సమాచారం అసెంబ్లీ వర్గాలు అందజేయకుంటే, ఇచ్చేంతవరకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఆందోళన అనంతరం ఉద్యమ కార్యాచరణ విషయంలో సీమాంధ్ర ఉద్యోగ నేతలు కేవీ కృష్ణయ్య, మురళీకృష్ణ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇతర ఉద్యోగులు జోక్యం చేసుకొని ఇరువురినీ వారించారు.