నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు ఈనెల 5 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈమేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున మంగళవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని వేదిక అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఏపీఎన్జీవోలతోపాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలసి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల పేరిట కాకుండా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున సమ్మె నోటీసు ఇస్తే చెల్లుతుందా? అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... గతంలోనూ వేదిక తరఫునే సమ్మె చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వేదిక కో కన్వీనర్ ఎన్.చంద్రశేఖర్‌రెడ్డితోపాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు ఏం చెప్పారంటే...
అసెంబ్లీ తిరస్కరించిన తర్వాత కూడా కేంద్రం ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు నిరసనగా ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగాలని సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో మొండిగా ముందుకెళితే కేంద్ర వ్యవస్థలను మూసేస్తాం. రైల్‌రోకోలతోపాటు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తాం.
ఈనెల 7, 8 తేదీల్లో అన్ని సంఘాల నేతలు సమావేశమై ఏయే రోజుల్లో ఏయే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయిస్తాం. ఈనెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు ప్రజాసంఘాలు, ప్రజలు, రాజకీయపార్టీలు కలసిరావాలి.
రాష్ట్ర విభజనకు కేంద్రానికి సహకరించే ఎంపీలు, కేంద్ర మంత్రుల భరతం పడతాం. వారే పార్టీ తరఫున పోటీ చేసినా ఓడిస్తాం. రెండు వారాలుండే ప్రభుత్వం కావాలో, జీవిత కాలం ఉండే ప్రజలు కావాలో వారు తేల్చుకోవాలి.
ఎన్నికల విధుల్లో కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ వ్యవస్థలు సమ్మెలో పాల్గొంటున్నందున సాధారణ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. విద్యార్థులకు ఇబ్బందులు వాటిల్లకుండా ఇంటర్మీడియెట్, టెట్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీస్తున్నాం.
సమ్మెకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కూడా పాల్గొంటున్నారని కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ప్రకటించారు.
బదిలీ ఉత్తర్వులు తీసుకోవద్దు
వీఆర్‌ఏ నుంచి తహశీల్దార్ల వరకు రెవెన్యూ యంత్రాంగమంతా సమైక్య సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు భూపరిపాలన ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావుకు సమ్మె నోటీసును అందజేశామన్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారమే తహశీల్దార్ల బదిలీ ఉత్తర్వులు పంపామని, సమ్మె నోటీసు నేపథ్యంలో వాటిని తీసుకోవద్దని కోరారు.
సమ్మెలో పాల్గొనం: ఆర్టీసీ కార్మికులు
ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుండటం, తాము సమ్మెలోకి వెళ్తే ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రెచ్చిపోయి ప్రయాణికుల జేబులు గుల్ల చేసే పరిస్థితి ఉండటంతో సమైక్య సమ్మెలో పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నట్టు సీమాంధ్ర ఆర్టీసీ కార్మికుల సంఘం ప్రకటించింది. అయితే ఈ సమ్మె గతంలో మాదిరిగా సకలజనుల సమ్మెగా మారే పరిస్థితి ఉంటే... తాము మరోసారి చర్చించుకుని సమ్మెలో పాల్గొనే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ సంఘం కన్వీనర్ దామోదర్ ‘సాక్షి’తో చెప్పారు.