దొరికితే గొంతు పిసికేవారేమో?
అప్పుడైతే ఒక్కడినే.. ఇప్పుడు ఎందరో లడాయికి దిగుతున్నరు: కేసీఆర్
టీఆర్‌ఎస్‌లో టీడీపీ ఎమ్మెల్యే హనుమంతు షిండే చేరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం ఒక్కడినే కొట్లాట మొదలుపెట్టానని, తాను వాళ్ల (సీమాంధ్ర వలస పాలకులు)కు దొరికితే బొండిగ (గొంతు) పిసికేసే వారేమోనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చేసిందని, కానీ సీమాంధ్ర నేతలంతా ఇంకా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు తీరుపై ప్రజలంతా తీవ్ర అసహ్యంతో ఉన్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ టీడీపీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.
‘‘నేనొక్కడినే పిడికెడు మందితో తెలంగాణ జెండా ఎత్తి కొట్లాట మొదలు పెట్టిన. ఈ బక్కోన్ని ఖతం చేస్తే మాట్లాడేటోళ్లు ఉండరనుకుని ఒంటరిగా దొరికితే బొండిగ (గొంతు) పిసికేసేవాళ్లేమో..? ఇప్పుడైతే భీముల్లాంటి వారెందరో గదలు పట్టుకుని తెలంగాణకోసం లడాయికి దిగుతున్నరు’’ అని ఆయన పేర్కొన్నారు. పాలమూరులో వలసలు, నల్లగొండలో ఫ్లోరైడ్, ఆదిలాబాద్‌లో అంటురోగాలతో ఆవేదనలో ఉన్న తెలంగాణను ఆంధ్రా వలసపాలకులు ఏనాడూ పట్టించుకోలేదని, పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని రెండురోజుల పాటు చెప్పుకొన్నా ఒడువదన్నారు. ‘‘ఇప్పటిదాకా కోల్పోయిన మా ఉద్యోగాలు మాకే కావాలంటున్నం.
స్వయంపాలన, ఆత్మ గౌరవం కావాలంటున్నం. ఇతరుల సొమ్ము కోసం కొట్లాడ్తలేం. గుంటూరులో గుంట జాగా అడుగుతున్నమా? మాది మాగ్గావాలంటే మీకెందుకంత నొప్పి? ఆంధ్రావాళ్లేమో మాది మాకే కావాలంటున్నరు, మీది కూడా మాకే కావాలంటున్నరు... ప్రపంచంలో ఎక్కడైనా ఇదేమన్నా ధర్మమా? ఆంధ్రాలో ఒక్కరైనా రాజనీతిజ్ఞులున్నరా? సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇస్తామంటే అడుగుతలేరు. విశాఖలో గిది కావాలె, తిరుపతిలో అది కావాలె అని అడగొచ్చు కదా. అక్కడి నేతలంతా రాజకీయ డ్రామాలే ఆడుతున్నరు’’ అని కేసీఆర్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై ప్రజలంతా అసహ్యంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో మునిగిపోయే పార్టీలో ఆ ప్రాంత టీడీపీ నాయకులు ఇంకా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారనే చెడ్డపేరు ఎందుకు తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో చేరి గౌరవాన్ని పెంచుకోవాలని సూచించారు.
‘తెలంగాణ ఇంక ఆగదు, ఏనుగుగెల్లింది.. తోక మాత్రమే మిగిలింది. రాష్ట్రాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు’ అని పేర్కొన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే హనుమంతు షిండే మాట్లాడుతూ... విభజన ఆపాలనడం, ఢిల్లీలో దీక్ష చేయడం, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి సంతకాలు పెట్టడం వంటి తెలంగాణ వ్యతిరేక పనులతో మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు హావభావాలతో తెలంగాణ ప్రజల కడుపులు రగిలిపోతున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరు వల్ల గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.