
ఎక్కడికక్కడి ముట్టడి
సాక్షి, నెట్‌వర్క్: కేంద్రకేబినెట్ ముందు తెలంగాణ నోట్ ప్రవేశపెడుతున్నారనే వార్త గురువారం సీమాం ధ్రను వేడెక్కించింది. భగ్గుమన్న సమైక్యవాదులు ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే ల ఇళ్లు, కార్యాలయాలను ముట్టడించారు. హోరున వర్షం కురుస్తున్నా ఉద్యోగులు ఇళ్ల ముట్టడి కార్యక్రమం కొనసాగించారు. అక్కడ వంటావార్పు చేయడంతోపాటు, దీక్షలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు, రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇళ్ల ఎదుట ఉద్యోగులు 48 గంటల దీక్ష చేపట్టారు. నెల్లూరులోని కేంద్రమంత్రి పనబాకలకిష్మ ఇంటిని ముట్టడించేం దుకు యత్నించిన సమైక్యవాదులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలోని కేంద్రమంత్రి పురందేశ్వరి ఇంటిని, ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కార్యాలయాన్ని, అనంతపురం, గోరంట్లలో ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప ఇళ్లతో పాటు కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి ఇళ్లను ముట్టడించారు.
అనంతపురంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి, ఎమ్మెల్యే పరిటాల సునీతను జేఏసీ నేతలు నిలదీశారు. కర్నూలులో కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఆత్మకూరులో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇళ్లను ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అయిభీమవరంలో ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంటి ఎదుట వంటావార్పు నిర్వహిం చారు. నరసాపురం బస్టాండ్ సెంటర్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ శిబిరం వద్ద మంత్రి పితాని సత్యనారాయణను సమైక్యవాదులు అడ్డుకున్నారు. విజయనగరంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం, గరివిడిలోని ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద, గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య క్యాంప్‌క కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. కురుపాంలోని కిశోర్‌చంద్రసూర్యనారాయణ దేవ్ ఇంటి ఎదుట వంటావార్పు చేపట్టారు.
భారీవర్షం కురుస్తున్నా వెనకడుగు వేయలేదు. ఓ సమయంలో కోటలోకి దూసుకునేందుకు యత్నించగా, మంత్రి తల్లి మృతి చెందారన్న వార్త తెలియడంతో సమైక్యవాదులు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఆమదాలవలసలో ఎమ్మెల్యేలు బొడ్డేపల్లి సత్యవతి, పాలకొండలో నిమ్మక సుగ్రీవుల ఇళ్లను, రాజాంలో మంత్రి కోండ్రు మురళి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తిరుపతిలో ఎంపీలు చింతామోహన్, శివప్రసాద్ ఇళ్లను సమైక్యవాదులు ముట్టడించారు.