Democrats united
-
ఎక్కడికక్కడి ముట్టడి
సాక్షి, నెట్వర్క్: కేంద్రకేబినెట్ ముందు తెలంగాణ నోట్ ప్రవేశపెడుతున్నారనే వార్త గురువారం సీమాం ధ్రను వేడెక్కించింది. భగ్గుమన్న సమైక్యవాదులు ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే ల ఇళ్లు, కార్యాలయాలను ముట్టడించారు. హోరున వర్షం కురుస్తున్నా ఉద్యోగులు ఇళ్ల ముట్టడి కార్యక్రమం కొనసాగించారు. అక్కడ వంటావార్పు చేయడంతోపాటు, దీక్షలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు, రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇళ్ల ఎదుట ఉద్యోగులు 48 గంటల దీక్ష చేపట్టారు. నెల్లూరులోని కేంద్రమంత్రి పనబాకలకిష్మ ఇంటిని ముట్టడించేం దుకు యత్నించిన సమైక్యవాదులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలోని కేంద్రమంత్రి పురందేశ్వరి ఇంటిని, ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కార్యాలయాన్ని, అనంతపురం, గోరంట్లలో ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, నిమ్మల కిష్టప్ప ఇళ్లతో పాటు కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి ఇళ్లను ముట్టడించారు. అనంతపురంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి, ఎమ్మెల్యే పరిటాల సునీతను జేఏసీ నేతలు నిలదీశారు. కర్నూలులో కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఆత్మకూరులో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇళ్లను ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అయిభీమవరంలో ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంటి ఎదుట వంటావార్పు నిర్వహిం చారు. నరసాపురం బస్టాండ్ సెంటర్లో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ శిబిరం వద్ద మంత్రి పితాని సత్యనారాయణను సమైక్యవాదులు అడ్డుకున్నారు. విజయనగరంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం, గరివిడిలోని ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద, గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య క్యాంప్‌క కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. కురుపాంలోని కిశోర్‌చంద్రసూర్యనారాయణ దేవ్ ఇంటి ఎదుట వంటావార్పు చేపట్టారు. భారీవర్షం కురుస్తున్నా వెనకడుగు వేయలేదు. ఓ సమయంలో కోటలోకి దూసుకునేందుకు యత్నించగా, మంత్రి తల్లి మృతి చెందారన్న వార్త తెలియడంతో సమైక్యవాదులు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఆమదాలవలసలో ఎమ్మెల్యేలు బొడ్డేపల్లి సత్యవతి, పాలకొండలో నిమ్మక సుగ్రీవుల ఇళ్లను, రాజాంలో మంత్రి కోండ్రు మురళి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తిరుపతిలో ఎంపీలు చింతామోహన్, శివప్రసాద్ ఇళ్లను సమైక్యవాదులు ముట్టడించారు. -
సీమాంధ్ర నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్న సమైక్యవాదులు
సాక్షి నెట్వర్క్: సమైక్యోద్యమం అధికార పార్టీ నేతలకు వణుకు పుట్టిస్తోంది. సీమాంధ్రలో నేతలను సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పదవులను పట్టుకుని ఇంకెంతకాలం వేలాడతారంటూ నిలదీస్తున్నారు. తక్షణం రాజీనామాలు ఆమోదింపజేసుకుని ఉద్యమంలోకి రావాలంటూ అల్టిమేటం ఇస్తున్నారు. గురువారం కడపలో సమైక్యవాదులు మంత్రి సి.రామచంద్రయ్య ఇంటిని ముట్టడించారు. మహిళలైతే ఏకంగా గాజులు, పూలు తెచ్చి మంత్రి ఇంటికి తగిలించారు! రాజీనామాను ఆమోదించుకుని రావాలని, లేదంటే గాజులు, పూలు పెట్టుకుని ఇంట్లో కూచోవాలని నినదించారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. కానీ రాజీనామాకు ఆమె ససేమిరా అన్నారు. మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కన్పించడం లేదంటూ ఆయన సొంత నియోజకవర్గం తెనాలిలో సమైక్యవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు! సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కడపలో సీఆర్ ఇంటిని సమైక్యవాదులు గురువారం ముట్టడించారు. రాజీనామా చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి వచ్చేదాకా దీక్షలు విరమించబోమని, అక్కడే నిరాహారదీక్షలు చేస్తామని ప్రకటించి పడుకుండిపోయారు. విభజన జరిగితే తామంతా అన్నం బదులు మట్టి తిని బతకాల్సి వస్తుందంటూ రహంతుల్లా అనే ఉపాధ్యాయుడు మట్టి తిని ఆవేదన వెలిబుచ్చారు. ఇంట్లోంచి వచ్చిన సీఆర్, సమైక్యోద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీనామా కోరిన సమైక్యవాదులతో, ‘నా రాజీనామాను ఎప్పుడో విసిరిపడేశా!’ అన్నారు. ‘‘దాన్ని ఆమోదించుకోండి. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తుంటే ప్రజాప్రతినిధులుగా అండగా నిలవాల్సిన బాధ్యత లేదా?’ అని వారు ప్రశ్నించారు. దాంతో, రైతులెక్కడ ఉద్యమం చేస్తున్నారని సీఆర్ ఎదురు ప్రశ్నించారు. వారికి పట్టంది మీకెందుకన్నారు. ‘అయినా చాలాసేపటి నుంచి మీడియా కవర్‌చేస్తోంది. ఇక చాల్లే పొండి’ అనడంతో సమైక్యవాదులు మండిపడ్డారు. శుక్రవారం కడప బంద్‌కు పిలుపునిచ్చారు. రాత్రి 9.10కి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళ్లాల్సిన సీఆర్‌ను పోలీసులు కడప నుంచి కాకుండా కమలాపురం రైల్వేస్టేషన్ నుంచి సాగనంపారు. మంత్రి దొడ్డిదారిన పారిపోవడం సిగ్గుచేటంటూ ఉద్యమకారులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటి వద్ద డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆద్యంతం అతి చేశారు. సమైక్యవాదులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. మహిళా ఉద్యోగులను వన్‌టౌన్ ఎస్ఐ జీఎం ఖాన్ చేయిపట్టి ఈడ్చబోయారు. ‘నాదెండ్ల కన్పించడం లేదు’! తెనాలి పట్టణంలో సమైక్యవాదులు వినూత్న నిరసన తెలిపారు. అసెంబ్లీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కన్పించడం లేదంటూ వాల్‌పోస్టర్లు అంటించారు. సమైక్యాంధ్ర నినాదాలతో ర్యాలీగా టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. తక్షణం నియోజకవర్గానికి వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకకుంటే నాదెండ్లను వేర్పాటువాదిగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు! పనబాకా... డౌన్, డౌన్! రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత తొలిసారిగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు వచ్చిన పనబాకను సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. బాపట్ల నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్తున్న కాన్వాయ్‌ని ఈపూరుపాలెం వద్ద నిలువరించారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు అద్దంకి వెళ్లిన పనబాకను ఘెరావ్ చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సమైక్యవాదులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరడంతో మంత్రి వేరే మార్గం నుంచి వచ్చారు. దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులకు నిరసనల మధ్యే సంఘీభావం తెలిపారు. పనబాక... గో బ్యాక్ అంటూ నినదిస్తున్న విద్యార్థినులతో కరచాలనం చేసి వెనుదిరిగారు. దాంతో, దొడ్డిదారిన వచ్చి పారిపోయిన పనబాక డౌన్ డౌన్ అంటూ సమైక్యవాదులు హోరెత్తించారు. మద్దిపాడు మండల పర్యటనలోనూ పనబాకకు సమైక్య సెగ తగిలింది. అంతకుముందు బాపట్ల రైల్వేస్టేషన్లో గురువారం తెల్లవారుజామున యువజన జేఏసీ నాయకులు అడున్నారు. పనబాక గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని పనబాక బాపట్లలో విలేకరులతో స్పష్టం చేశారు. సమైక్యవాదినే అయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధిష్టానానికి సూచించామన్నారు. సీమాంధ్ర రాజధానిగా విజయవాడను ప్రతిపాదిస్తానన్నారు. సమైక్య నినాదం చేసేందుకు కూడా ససేమిరా అన్నారు! ఎమ్మెల్సీని చుట్టుముట్టిన ఉపాధ్యాయులు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నరసరావుపేటలో రిలే నిరాహారదీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ లక్ష్మణరావును ఉపాధ్యాయ సంఘాల నేతలు చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తానని ఆయన బదులిచ్చారు. సమైక్యాంధ్ర కోసం చేసిన రాజీనామాను వెంటనే ఆమోదింపజేసుకుని ఉద్యమంలో పాల్గొనాలంటూ అరకు ఎమ్మెల్యే సివేరి సోమ క్వార్టర్స్ ముందు సమైక్యవాదులు బైఠాయించారు. దాంతో వారు వెళ్లిపోయాకే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు!