టీ నోట్‌పై భగ్గు
Published Fri, Oct 4 2013 3:00 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :తెలుగువారి ఐక్యతను దెబ్బతీస్తూ.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బేఖాతరు చేస్తూ.. ప్రజాకాంక్షను విస్మరిస్తూ.. సీమాంధ్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు ఆమోదం తెలపడంపై జిల్లా భగ్గుమంది. ఏదైతే జరగకూడదని జిల్లా ప్రజలు 65 రోజులుగా మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారో అదే జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో గురువారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజలు హతాశులయ్యారు. దాంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం బుధవారం నుంచి నిరాహారదీక్షలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 72 గంటల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక ఉద్యోగ జేఏసీ నేతలు గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమై బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి జిల్లా ఆందోళనలతో అట్టుడకనుంది. గురువారం ఉదయం నుంచే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్, ఉద్యోగ జేఏసీ ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించడంతో జిల్లా మరింతటగా అట్టుడకనుంది.
పెల్లుబికిన నిరసన.. భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోగానే జిల్లా ప్రజలు ఆందోళనలకు దిగారు. సమైక్యాంధ్రకు కట్టుబడిక ఏకైక ప్రధాన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధర్నాకు దిగింది. ఇప్పటికే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు బుధవారం నుంచి నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం గురువారం వెలువడగానే పార్టీ నేతలు ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు. సమన్వయకర్తలు దీక్షల్లో ఉండగా.. ఇతర ముఖ్య నేతలు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలుగువారి ప్రయోజనాలను విఘాతం కలిగిస్తూ కేవలం ఓట్లు-సీట్ల కోసం సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని విరుచుకుపడ్డారు.
ఈ ధర్నాలో పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, వేమూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడులో వైఎస్సార్‌సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ధర్నా చేశారు. కర్నూలు రహదారిపైకి వందలమంది నేతలు, కార్యకర్తలు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఇందులో పార్టీ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ అమృతపాణి, మండల కన్వీనర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు. చీరాలలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర విభజన నిర్ణయంపై భగ్గుమన్నారు.
సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఒంగోలు చర్చి సెంటర్‌లో ధర్నా చేశారు. టైర్లు కాల్చి రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర ఫ్రంట్ ప్రతినిధులు ఒంగోలు మంగమూరు సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను కొంతసేపు అడ్డుకున్నారు. విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నోట్ రానుందని తెలియగానే చీరాలలో జేఏసీ నేతలు గురువారం మధ్యాహ్నమే ఆందోళనకు దిగారు. గుంటూరు మాధవరావు, నారాయణ శేషసాయి అనే ఇద్దరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్యానికి కూడా పాల్పడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మార్కాపురం, కనిగిరి, అద్దంకి, పర్చూరులలో కూడా జేఏసీ నేతలు, సభ్యులు రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు చేశారు.
బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపు
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ 72 గంటల పాటు బంద్ పాటించాలని నిర్ణయించింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లాలో కూడా బంద్‌ను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలతో పాటు అన్ని కార్యకలాపాలను స్తంభింపజేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మేరకు జిల్లా పార్టీకి దిశానిర్దేశం చేశారు. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజలను కోరారు. జిల్లా పార్టీ కన్వీనర్ నూకసాని బాలాజీ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తున్నారు. అదే విధంగా ఎన్జీవో జేఏసీ కూడా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 48 గంటల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై చర్చించేందుకు జేఏసీ నేతలు ఎన్జీవో భవన్‌లో గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు.
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
రాష్ట్ర విభజన నిర్ణయంపై వెల్లువెత్తే ప్రజావ్యతిరేకతను బలప్రయోగంతో అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం చేపట్టిన ముందస్తు చర్యలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పోలీసు యంత్రాంగానికి గురువారం ఉదయమే సమాచారం అందింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎస్పీ ప్రమోద్‌కుమార్ ఒంగోలులోని ఎన్జీవో జేఏసీ నేతలను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. కేంద్ర నిర్ణయం వెలువడిన తరువాత కూడా శాంతియుతంగానే నిరసన తెలపాలని సున్నితంగానైనా కచ్చితంగా చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అదే సమయంలో ఎస్పీ ప్రమోద్‌కుమార్ జేఏసీ నేతలను సుతిమెత్తంగా హెచ్చరించారు కూడా. ఆందోళనలు హద్దుమీరితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పీడీ యాక్టు నమోదు చేసేందుకు కూడా వెనుకాడమని చెప్పడం ద్వారా పోలీసు యంత్రాంగం ఉద్దేశాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఉద్యోగులు అనవసరంగా పోలీసు కేసుల్లో ఇరుక్కోవద్దని కూడా హెచ్చరించడం గమనార్హం. అంటే రాష్ట్ర విభజనపై వెల్లువెత్తే ఉద్యమాన్ని పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని కేంద్రం భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
Advertisement
Advertisement