రహదారుల దిగ్బంధం
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం అలుపెరుగకుం డా సాగుతోంది. వరుసగా 89వరోజైన ఆదివారం కూడా సీ మాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ విభిన్నరూపాల్లో ప్రదర్శనలు, విభజనయత్నాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు హోరెత్తాయి. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపుమేరకు ఏపీఎన్జీవోలు ఆదివారం కోస్తా, రాయలసీమ జిల్లాల మీ దుగా వెళ్లే జాతీయరహదారులను ఎక్కడికక్కడ ముట్టడిం చారు. విజయవాడ బెంజిసర్కిల్‌లో రహదారులను దిగ్బంధిం చారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎన్జీవోలు మానవహారం ఏర్పాటు చేశారు. ఎన్జీవోలు ధర్నా చేస్తుండగా, జై ఆంధ్ర ఉద్యమ నేత బోస్, విద్యాసాగర్ వద్దకు వచ్చి రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరుతూ కరపత్రం ఇ చ్చేందుకు ప్రయత్నించారు. ఎన్జీవో నేతలు ఆ పత్రాలను చించే సి జైఆంధ్ర ఉద్యమ నేతలను అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొం ది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. జేఏసీ పిలుపు మేరకు చల్లపల్లి, అవనిగడ్డల్లో రిలే నిరశన దీక్షలు చేపట్టారు.
సోనియాను ఇటలీకి పంపాల్సిందే:ఎన్జీవోనేతల డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జిల్లా ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో గంటపాటు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రాష్ట్ర విభజనకు యత్నిస్తున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పౌరసత్వాన్ని రద్దు చేసి ఇటలీకి పంపాలని నేతలు డిమాండ్ చేశారు. తణుకు జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తేతలి వై జంక్షన్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. చింతలపూడిలో ఏలూరు-సత్తుపల్లి రహదారిపై బోసుబొమ్మ సెంటర్లో ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు,ఆకివీడు, పెనుమంట్ర, ఆచంటల్లో మహిళలు రిలే నిరశన దీక్షలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీవోలు అమలాపురం ఎర్రవంతెన వద్ద 216 జాతీయ రహదారిని, రావులపాలెంలో 16వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు.
చిత్తూరు బైపాస్ రోడ్డు హైవేపై ప్రభుత్వోద్యోగులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరులో కలెక్టరేట్ వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించారు. పుంగనూరులో పట్టణ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు వరదారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో జరిగింది. రాష్ట్ర విభజన జరిగితే ఆత్మహత్యలే శరణ్యమంటూ గొంతుకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. గోకుల్ సర్కిల్‌లో అర్ధనగ్న ప్రదర్శన చే శారు. బొగ్గు కుంభకోణంలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని విభజించే హక్కులేదంటూ వీఆర్వో మురళి ముఖానికి బొగ్గు పూసుకొని, నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. మదనపల్లెలోని మల్లికార్జున సర్కిల్‌లో మానవహారం చేపట్టారు. వారపు సంత వద్ద వాటర్ ట్యాంక్ పెకైక్కి నిరసన తెలిపారు. పలమనేరులో మూడు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
ఎంపీ చింతామోహన్ అడ్డగింత
శ్రీకాళహస్తికి ఎంపీ చింతామోహన్ వస్తున్నట్టు తెలుసుకున్న ఎన్జీవోలు ఏపీసీడ్స్ సర్కిల్ వద్ద కాపుకాచి ఆయన కారును అడ్డుకుని, సమైక్య నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. కంబదూరు, శెట్టూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కుందుర్పిలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా కడపలో ఇర్కాన్ సర్కిల్ వద్ద రోడ్డును దిగ్బంధించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
రైల్వేకోడూరులో రోడ్డుపైనే నిరసన చేపట్టారు. రాయచోటిలో ఎన్జీఓలు, ఉపాధ్యాయులు ర్యాలీ, మానవహారాలు చేపట్టి రహదారులను దిగ్బంధించారు. బద్వేలులో 89 ఆకారంలో కూర్చొని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నెల్లూరు చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎన్‌జీవోలు రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి- మాచర్ల ప్రధాన రహదారిపై ఏపీఎన్జీవోలు ప్రదర్శన నిర్వహించారు. కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలో రైతు కూలీలు ధర్నా చేపట్టారు. తెనాలిలో ఏపీ ఎన్జీవోలు బైక్ ర్యాలీ నిర్వహించారు.