సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 116వరోజూ శనివారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉధృతంగానే కొనసాగింది. అనంతపురం జిల్లా కదిరిలో వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఇడ్లీ డే సందర్భంగా ఎస్వీ స్కూలు విద్యార్థులు ఐదు అడుగుల వెడల్పున్న ఇడ్లీని తయారుచేసి తెలుగుతల్లికి నివేదించారు. పుంగనూరులో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. సమైక్య ఉద్యమాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండి సెంటర్లో జేఏసీ నేతలుదహనం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సమైక్యవాదులు భారీ మానవహారంగా నిలబడ్డారు.
ఎంపీ చింతామోహన్, ఎమ్మెల్యే పయ్యావులకు సమైక్య సెగ
తిరుపతి ఎంపీ చింతామోహన్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు వేర్వేరు ప్రాంతాల్లో సమైక్య సెగ తగిలింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన చింతామోహన్‌ను వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతపురం జిల్లా బెళుగుప్పలో జరిగిన రచ్చబండలో ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.