బాబుతో భేటీ కానున్న ముగ్గురు మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చిన తదనంతర పరిణామాల్లో రాష్ట్ర విభజన జరిగిపోయిన పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని బతికించుకోవడమెలా అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఆ ప్రాంత నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్‌టీఆర్ భవన్‌లో సీమాంధ్ర నేతలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత జిల్లాల వారీగా నేతలతో ముఖాముఖి సమావేశమై పార్టీ భవిష్యత్తుపై చర్చిస్తారు. ఇలావుండగా, పార్టీ భవితవ్యం అయోమయంగా మారిన నేపథ్యంలో ప్యాకేజీలు ఇస్తూ ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్పించుకోవడానికి పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు, ఆపద్ధర్మ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి మారెప్ప సోమవారం ఉదయం చంద్రబాబుతో భేటీ కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.