
శీతల గిడ్డంగిలో ఘోర అగ్నిప్రమాదం
షార్ట్‌సర్క్యూట్ వల్లే అంటున్న అధికారులు
రూ.12 కోట్ల విలువైన ఐటీసీ మిర్చి నిల్వలు దగ్ధం
రైతులకు చెందిన మరో రూ.2 కోట్ల విలువైన
మిర్చి కాలి బూడిద
యడ్లపాడు : శీతలగిడ్డంగిలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఎర్రకొండ వద్ద ఉన్న సీఆర్ కోల్డ్ స్టోరేజ్‌లో ఏసీ విభాగానికి చెందిన విద్యుత్ వైర్లులో షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం వరకు దట్టంగా పొగలు మాత్రమే కనిపించగా సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఉదయం 8.10 గంటల సమయంలో కోల్డ్‌స్టోరేజ్ పైభాగంలోని ఏసీ మిషన్లు ఉండే ప్రాంతంలో పొగలు వస్తుండటాన్ని అధికారులు గమనించారు. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో సుమారు 35 వేల టిక్కీల మిర్చి నిల్వలు ఉన్నాయని యజమాని కొత్తపల్లి రమేష్‌చంద్ర తెలిపారు. వీటిలో 30 వేల టిక్కీలు ఐటీసీ సంస్థవి, యడ్లపాడు, ప్రత్తిపాడు మండలాలకు చెందిన సుమారు 1200 మంది రైతులు ఇందులో మిర్చి నిల్వ చేశారు. పొగలు రావడాన్ని సెక్యూరిటీ గార్డులు గమనించి యజమానికి తెలియజేశారు. సమాచారం అందడంతో 8.30కి ఫైర్, పోలీసు సిబ్బంది వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది స్టోరేజ్ తలుపులు తీసే ప్రయత్నం చేయడంతో దట్టమైన పొగలు, తీవ్రంగా కారం కోర్‌తో తలుపులు మూసి బయటకు పరుగులు పెట్టారు. 11 గంటల వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయారు. మంగళవారం రాత్రి ఐటీసీ వారు తెచ్చిన 390 టిక్కీల మిర్చి స్టోరేజ్ కింద ప్లాట్ ఫారంలోనే ఉండటంతో వాటిని వెంటనే గుంటూరులోని మరో స్టోరేజ్‌కు తరలించారు.
మిర్చి రైతుల ఆందోళన..
కోల్డ్‌స్టోరేజ్‌కు నిప్పు అంటుకుందన్న సమాచారంతో రైతులు పరుగు పరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. అందరిలోనూ ఆందోళనతో కళ్లల్లో నీళ్లు కనిపించాయి. తమను లోపలికి పోనిస్తే టిక్కీలను తీసుకొచ్చుకుంటామంటూ వేడుకున్నారు. అయితే పోలీసులు లోపలకు పోలేని పరిస్థితి ఉందంటూ చెప్పి ఆపారు. ముందుగా ఐటీసీ వారి టిక్కీలను బయటకు తెచ్చేందుకు పొక్లెయిన్‌ను తీసుకురాగా, రైతులు దానిని అడ్డుకున్నారు. ఐటీసీ వారికి బీమా ఉంటుంది. ముందుగా మా టిక్కీల సంగతి తేల్చాలంటూ పట్టుబట్టారు. దీంతో యజమానికి, రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. గంటసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామని చిలకలూరిపేట రూరల్ సీఐ దిలీప్‌కుమార్ చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు.
బయటకు తెచ్చింది 700 మిర్చి టిక్కీలు..
పొక్లెయిన్‌లతో శీతలగిడ్డంగి రెండు వైపులా గోడలను పగులగొట్టారు. ముఠా కార్మికులు సాయంత్రం వరకు కష్టపడి 700 టిక్కీలను బయటకు తీసుకురాగలిగారు. చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, గుంటూరు-2 నుంచి అగ్నిమాపక శకటాలు, సిబ్బంది వచ్చి రక్షణ చర్యలను చేపట్టారు. ఐటీసీ జనరల్ మేనేజర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సుమారు రూ.12 కోట్ల విలువైన నిల్వలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులు ఉంచిన మిర్చి టిక్కీలు రూ.2 కోట్లు, దెబ్బతిన్న భవనం విలువ రూ.8 కోట్లు ఉంటుందని గిడ్డంగి యజమాని కొత్తపల్లి రమేష్‌చంద్ర తెలిపారు.