సీనియర్స్ సిటిజన్స్‌కు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆకలి కేకల బాధలను డెప్యూటీ తహసీల్దార్ రాఘవయ్యకు వివరిస్తున్న వయో వృద్ధులు
గుంటూరు, ప్రత్తిపాడు: ‘వయస్సు మీద పడింది. ఆకలి కష్టాలు తప్పడం లేదు. కడుపు నింపలేని ప్రకటనలు, ఆకలి తీర్చలేని నిబంధనలు మాకేందుకు. ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రాణం పోయేలా తిరుగుతున్నాం. వేలిముద్రలంటూ సర్కారు తెచ్చిన రూలు కడుపునకు నాలుగు రూకలు పెట్టలేకపోతుంది. మలి వయస్సులో అరిగిన చేతి వేళ్లే ముద్ద నోటిలోనికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి’ అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక పోలిస్ స్టేషన్‌లో నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ అవగాహన సదస్సులో వృద్ధులు ఏళ్ల తరబడి తాము పడుతున్న బాధలను డిప్యూటీ తహసీల్దార్ రాఘవయ్య ఎదుట ఏకరువు పెట్టారు.
రెండేళ్లుగా బియ్యం రావడం లేదు..
రెండేళ్లుగా రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. వెళ్లినప్పుడల్లా వేలిముద్రలు పడటం లేదని చెబుతున్నారు. తిరిగి తిరిగి విసుగొస్తోంది. కనీసం బియ్యం కూడా ఇవ్వకపోతే ఎలాగయ్యా.. కొంచెమైనా కనికరం చూపించండి సారూ.– షేక్ చాంద్‌బి,ప్రత్తిపాడు
మిషన్లు పెట్టిన దగ్గర్నుంచి..
వేలిముద్రల మిషన్లు పెట్టిన దగ్గర నుంచి బియ్యం కోసం కోటాల చుట్టూ తిరుగుతున్నా. వేలిముద్రల పడటం లేదంటారు. ఇవ్వరు. ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగానో. పట్టించుకున్నోళ్లు లేరు. వీఆర్వో వత్తారు. బియ్యం ఇత్తారు అంటారు. కానీ ఎప్పుడిచ్చిన పాపాన పోలేదు.–దూపాటి సుందరరావు, తూర్పుపాలెం
దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం..
రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నా. వేలిముద్రలు పడటం లేదంటారు. మళ్లీ రమ్మంటారు. బియ్యం మాత్రం ఇవ్వరు. ఒకసారి ఆధార్‌లో మార్చుకోమంటారు.
–గింజుపల్లి బాలాత్రిపురసుందరి,ప్రత్తిపాడు
Comments
Please login to add a commentAdd a comment