సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సీనియర్ ఐఏఎస్‌ల కొరత పట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం పలువురు సీనియర్ ఐఏఎస్‌లు కేంద్ర సర్వీసులకు తర లిపోవడమే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడమే ఉత్తమమని వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మందికి ఇప్పటికే కేంద్ర సర్వీసులో పోస్టింగ్‌లు రావడంతో వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలోని కీలక శాఖలకు సీనియర్ ఐఏఎస్‌లు లేక ఇన్‌చార్జీల పాలన కొనసాగుతోంది.
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న పుష్ప సుబ్రహ్మణ్యం అయితే ఇంకా కేంద్ర సర్వీసులో పోస్టింగ్ రాకుండానే మూడు వారాల పాటు సెలవు పెట్టి ఢిల్లీ వెళ్లిపోయారు. మూడు వారాల్లోగా కేంద్ర సర్వీసులో పుష్ప సుబ్రహ్మణ్యంకు పోస్టింగ్ రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆర్థిక శాఖ (బడ్జెట్) ముఖ్యకార్యదర్శి పోస్టు ఖాళీ అయింది.
అలాగే ఆర్థిక శాఖ మరో ముఖ్యకార్యదర్శి పి.వి. రమేశ్ కూడా నెల రోజుల పాటు శిక్షణ కోసం వెళ్లిపోయారు. దీంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నెలాఖరుతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి భాస్కర్ కూడా పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆర్థిక శాఖలోనే మూడు కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. సీనియర్ ఐఏఎస్‌లు లేకపోవడంతో పలు కీలక శాఖలకు ఇన్‌చార్జిలను నియమిస్తున్నారు. ఇటీవలే గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుకు వెళ్లడంతో ఆ పోస్టులో నాగిరెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి, పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి పదవులు ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో రాజీవ్ రంజన్ మిశ్రాతో పాటు వసుధా మిశ్రా కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. మరి కొంత మంది కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు కేంద్రంలో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.