సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి మృతి | Senior politician Leader Ramaswamy died | Sakshi
Sakshi News home page

సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి మృతి

Published Tue, Jun 24 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి మృతి

సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి మృతి

కిర్లంపూడి : కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి సోమవారం మధ్యాహ్నం కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చాలాకాలం పాటు  కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పలుమార్లు టిక్కెట్ ఆశించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు తన మేనల్లుడైన చలమలశెట్టి సునీల్.. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడంతో ఆ పార్టీలో చేరారు.
 
 కిర్లంపూడి మండలంలోనే కాకుండా పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో ఆయన కీలక నాయకునిగా వ్యవహరిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. బంధువులు, వివిధ పార్టీల నాయకులు వీరవరంలో రామస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహంతోపాటు చలమలశెట్టి సునీల్, చలమలశెట్టి గోపి, జగ్గంపేట పీఏసీఎస్ అధ్యక్షురాలు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణి, జ్యోతుల కుమార్తె సునీత, సోదరుడు సుబ్బారావులు రామస్వామి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
 
 తోట రామస్వామి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, హైదరాబాద్ నుంచి ఫోనులో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. రామస్వామి కుటుంబాన్ని పరామర్శించినవారిలో విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తోట ఈశ్వరరావు, తోట గాంధీ తదితరులున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement