కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్
చిలకలపూడి(మచిలీపట్నం): ఓటరుకు తెలియకుండా వారి ఓటు తొలగించాలని ఆ వ్యక్తి పేరుతో ఆన్‌లైన్‌లో ఫారం–7 ద్వారా నమోదు చేసిన వ్యక్తులపై ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా జగ్గయ్యపేట, పెనమలూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, మైలవరం, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించాలని చీటింగ్‌దారులు కొంత మంది సుమారు 30 వేల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారన్నారు.
ఇవి గత నెల 26, 27 తేదీల్లో ఎక్కువగా నమోదయ్యాయని తాము గుర్తించామన్నారు. అనంతరం మార్చి 1వ తేదీన తాను జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్‌బూత్‌లలో పరిశీలించి ఈ విధంగా ఓట్లు తొలగింపు దరఖాస్తులు చేసుకునే వాటిని పరిశీలించామన్నారు. పరిశీలన అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లకు ఆన్‌లైన్‌లో పొందుపరిచిన దరఖాస్తులు, ఎవరి పేరుతో నమోదై ఉన్నాయో వారి వివరాలను ఆయా గ్రామాలకు వెళ్లి తనిఖీ చేసి వారిని ప్రశ్నించామన్నారు. ఓటరుకు తెలిసే దరఖాస్తు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఓట్లను తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశార అన్న వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఇలా నమోదైన వాటిలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు సంబంధించి ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదు చేశామన్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల, అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో ఇటువంటి దరఖాస్తులు కావటంతో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో వీటిపై కేసులు నమోదయ్యాయన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని చిలకలపూడి, తాలుకా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు. మైలవరం నియోజకవర్గంలో మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో పడమట పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్, ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేయటం, తదితర సెక్షన్లతో ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు.
ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తులకు సంబంధించి 15 కేసులు నమోదు చేశామన్నారు. వీటిని పూర్తిస్థాయిలో పోలీస్ అధికారులు విచారణ చేపట్టి వ్యక్తులను గుర్తించటం, ఎన్ని ఓట్లు తొలగించేందుకు దరఖాస్తు చేశారో కూడా పరిశీలించిన అనంతరం అవసరమైతే ఆ వ్యక్తిని జిల్లా బహిష్కరణ చేసేందుకూ వెనుకాడబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment