సిబ్బందిపై సీరియస్ | Serious on staff | Sakshi
Sakshi News home page

సిబ్బందిపై సీరియస్

Published Sun, Dec 29 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

Serious on staff

భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం ఇందిరాక్రాంతి పథం కార్యాలయ పరిధిలో గల కొంతమంది సిబ్బంది సమాఖ్యల అభివృద్ధికి కేటాయించిన నిధులను కొల్లగొడుతున్నారనే విషయం తేటతెల్లమైంది. ఐకేపీ సిబ్బంది స్వాహా పర్వంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాల నేపథ్యంలో విచారణకు వచ్చిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ చీఫ్ విజిలెన్స్ అధికారి రాజబాబు నేత్రుత్వంలోని బృందం శనివారం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించింది. దుమ్ముగూడెం మండలానికి వెళ్లిన అధికారులకు మహిళా సమాఖ్య సభ్యులు ఐకేపీ సిబ్బంది తీరుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న విషయాన్ని గుర్తించిన చీఫ్ విజిలెన్స్ అధికారి రాజబాబు అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొదట లక్ష్మీనగరంలోని సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించి ఐకేపీ ద్వారా సమాఖ్యల అభివృద్ధికి అమలు చే స్తున్న పథకాలపై సమీక్షించారు. ఈ పథకాలు సమాఖ్యల సభ్యులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్త్రీనిధి ద్వారా పంపిణీ చేసిన రుణాలు, రికవరీ, పాడిగేదెల పంపిణీ, వాటి వినియోగం వంటి అంశాలపై వారితో చర్చించారు. ‘క్లస్టర్ పరిధిలో ఎంతమంది లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.. వాటి ని ఎన్నిసార్లు తనిఖీ చేశావు’ అని క్లస్టర్ కో- ఆర్డినేటర్ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు.

తాను వాటిని చూడలేదని సమాధానం చెప్పడంతో ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే మీకు ఉద్యోగాలెందుకని మందలించారు. అనంతరం దుమ్ముగూడె ం గ్రామాన్ని సందర్శించి సమాఖ్య సభ్యులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్పులు ఐకేపీ సిబ్బంది కాజేశారని శ్రీనగర్ కాలనీలో కొంతమంది మహిళలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
 దీంతో విజిలెన్స్ అధికారి రాజబాబు అక్కడే ఉన్న ఇన్‌చార్జి ఏపీఎం లక్ష్మీదుర్గ నుంచి వివరాలు తెలుసుకొని స్వాహా చేశారని నిర్ధారించుకుని అసహనం వ్యక్తం చేశారు. సుమారు రూ.19 వేలు వాడుకున్న సిబ్బంది ఇటీవలే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు వెల్లడైంది. అలాగే వెన్నెల గ్రూపునకు చెందిన మహిళలు ఐకేపీ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్త్రీ నిధి కింద పావలా వడ్డీ రుణాలు ఇచ్చే సమయంలో ఒక్కో గ్రూపు నుంచి రూ.20 వేల వరకూ మినహాంచుకుంటున్నారని, ఈ విషమాన్ని అధికారుల దృష్టికి పలుమార్లు తెచ్చినా ఫలితం లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం మండలంలోని డబ్ల్యూ రేగుబల్లి గ్రామాన్ని సందర్శించి మహిళా సమాఖ్య సభ్యులతో మాట్లాడారు.

ఆ తర్వాత మణుగూరు మండల సమాఖ్య కార్యాలయాన్ని పరిశీలించి ఆరోపణలపై విచారణ జరిపారు. మొత్తంగా ఆయన వెళ్లిన ప్రతిచోటా మహిళా సమాఖ్యలు చేసిన ఫిర్యాదులు వాస్తవమేనని రుజువు కావడంతో ఐకేపీ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట  ఏపీడీ ఆర్.జయశ్రీ తదితరులు ఉన్నారు. చర్యలు తీసకుంటాం..రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలయ్యే అన్ని రకాల పథకాలు సమాఖ్యలకు ఏ మేరకే అందుతున్నాయనే దానిపై పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని, అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రాజబాబు చెప్పారు. దుమ్ముగూడెంలో విలేకరులడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెపుతూ.. అన్ని రకాల కార్యక్రమాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర నివేదిక అనంతరం తగిన చర్యలు ఉంటాయన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement