వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి | Seven died different incidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

Published Sun, Feb 16 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

Seven died different incidents

జిల్లాలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో విద్యుత్ స్తంభం మీద పడడంతో లైన్‌మేన్ ప్రాణాలు కోల్పోయాడు. కాళ్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో మరోవ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మొగల్తూరు మండలం ఎల్‌బీ చర్ల, దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యం కాగా పెదవేగి పోలీస్‌స్టేషన్
 పరిధిలో ఒకరు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.
 
 విద్యుత్ స్తంభం మీద పడి..
 ఏలూరు (టూటౌన్),న్యూస్‌లైన్ : నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం మీద పడడంతో ఓ విద్యుత్ ఉద్యోగి శనివారం మృతి చెందాడు. ఏలూరు  మండలం శనివారపుపేటకు చెందిన రావినూతల శ్రీనివాస్ (43) పెదవేగి మండలం పెదకడిమిలో లైన్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం శ్రీనివాస్‌పై పడింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ ఉద్యోగులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు.
 
 గుర్తుతెలియని మహిళ దుర్మరణం
 నిడదవోలు, న్యూస్‌లైన్ : నిడదవోలు రైల్వేస్టేషన్ పరిధిలోని సింగవరం సమీపంలో ట్రాక్‌పై శనివారం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్లే గుర్తుతెలియని రైలు ఢీ కొని ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఐదడుగుల పొడవు, చామనఛాయ రంగులో ఉందని, 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో మృతదేహం పడి ఉండడాన్ని బట్టి ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  రైల్వే హెచ్‌సీ పరమహంస తెలిపారు. మృతురాలిని గుర్తుపట్టిన వారు 92474 03097 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.
 
 ఎల్‌బీ చర్ల చెరువుగట్టుపై..
 మొగల్తూరు, న్యూస్‌లైన్: మొగల్తూరు మండలం ఎల్‌బీ చర్ల చెరువుగట్టుపై గుర్తుతెలియని మృతదేహన్ని స్థానికులుగుర్తించారు. ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని వడేటి పర్ర మురుగుకాలువ గట్టును ఆనుకుని ఉన్న పెద్దపట్నపు రామారావు చెరువు వద్ద మృతదేహం పడి ఉందన్నారు. మృతుడి ఎడమచేతిపై వీఆర్ సింహాచలం అని పచ్చబొట్టు రాసి ఉందని, మృతుడి వయసు  40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. మృతుడు ఐదు రోజులుగా గ్రామంలో పిచ్చికేకలు వేస్తూ సంచరించినట్టు గ్రామస్తులు తెలిపారు. అతడి వివరాలు తెలిస్తే 9440796619 నెం.కు తెలపాలని కోరారు.
 
 
 అనుమానాస్పదస్థితిలో..
 పెదవేగి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని విజయరాయి స్పిన్నింగ్‌మిల్లు సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై కె.స్వామి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదపాడు మండలం రామచంద్రపురానికి చెందిన ముంగంటి సూర్యనారాయణ (35) ఫ్యాక్టరీలకు కూలీలను పంపిస్తుంటాడు. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద నుంచి సూర్యనారాయణ ఫ్యాక్టరీకి వెళ్లాడు. శనివారం ఉదయం  సూర్యనారాయణ మృతి చెందినట్టు తనకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు అతని భార్య రమాదేవి చెప్పారని, ఫ్యాక్టరీకి చెందిన వారెవరో తన భర్తను కొట్టి చంపి ఉంటారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 ఏలూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
 ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ : సాధారణంగా వేసుకునే మాత్రలకు బదులు పొరపాటున వేరే మందు బిళ్లలు వేసుకుని అస్వస్థతకు గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు బావిశెట్టివారి పేటకు చెందిన బలువూరి రమ్య (19) ఏలూరు హేలాపురి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం ఇంటిలో ఒంటరిగా ఉన్న రమ్య ఏవో మాత్రలను వేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చేసరికి రమ్య మృతి చెందింది. వన్‌టౌన్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
 గుర్తుతెలియని మృతదేహం లభ్యం
 గౌరీపట్నం (దేవరపల్లి), న్యూస్‌లైన్: దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రం వెనుక వైపున క్వారీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సర్పంచ్ మెరిపో వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా పాడైపోయి దుర్వాసన వెదజల్లుతూ గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉందని హెడ్ కానిస్టేబుల్ కె.సూరిబాబు తెలినపారు. మృతుడికి 35 ఏళ్లు ఉంటాయని, ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement