different incidents
-
ముగ్గురి ఆత్మహత్య
కైకరం(ఉంగుటూరు) : వేర్వేరు చోట్ల బుధవారం ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం పడమర విప్పరుకు చెందిన వాలిపల్లి రాజారావు (45)కు 20ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి భార్యా, పిల్లలు అతనికి దూరంగా ఉం టున్నారు. దీంతో మానసికంగా కుంగి పోయిన అతను వారం క్రితం తన సోదరి బొమ్మిడి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. మంగళవారం సోదరి ఇంటివద్ద పురుగు మందు తాగి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి .. ఏలూరు అర్బన్ : స్థానిక జ్యూట్‌మిల్ ప్రాంతంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జాన్సన్ కథనం ప్రకారం.. ఓవర్‌బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని బుధవారం స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే హెచ్‌సీ జాన్సన్ మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతుని గురించి స్థానికులను విచారించినా ఎలాంటి సమాచా రం లభించలేదు. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం బాగా ఛిద్రమైంది. మృతుడు నల్లరంగు గళ్లు కలిగిన లేత బిస్కెట్ రంగు పొడవు చేతుల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వయసు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, వివరాలు తెలిసిన వారు 9491362001 నంబరు కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉరేసుకుని యువకుడు మృతి మొగల్తూరు : గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మొగల్తూరు స్టేషన్ పరిధి సీతారామపురంలో జరి గింది. ఎస్ఐ డి.జె.రత్నం కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కర్ల చందు (25) కొంత కాలంగా సీతారామపురంలో పొక్లెయిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇక్కడే గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన గదికి వెళ్లిన చందు బుధవా రం ఉదయం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టారు. దీంతో అతను ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వీఆర్వో కురెళ్ళ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు విద్యార్థుల బలవన్మరణం
వీరవాసరం : అంతుబట్టని కారణాలతో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిండు జీవితాలను ముగించేశారు. ఆత్మహత్యల నివారణ దినం ముందు రోజు ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. ఓ యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శుక్రవారం జరిగింది. వీరవాసరం మండలం తోలేరు గ్రామానికి చెందిన గన్నపురెడ్డి సాయి సత్యనారాయణ(19) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గది తలుపులు వేసి ఉండడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వాటిని బద్దలు కొట్టారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని సత్యనారాయణ విగతజీవిగా ఉండడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. వీరవాసరం పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ మూడో సంవత్సరం చదువుతున్న సాయి సత్యనారాయణ మృతితో తోలేరులో విషాదఛాయలు అలముకున్నాయి. సత్యనారాయణకు తల్లి, సోదరుడు ఉన్నారు. తండ్రి గతంలోనే చనిపోయాడు. ఇంటికి పెద్ద కొడుకు మరణవార్తను ఆ తల్లి జీర్ణించుకోలేక శోకసంద్రంలో మునిగారు. వీరవాసరం పాలిటెక్నిక్ కళాశాలలో సత్యనారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వర్ధినీడి సత్యనారాయణమూర్తి, కురెళ్ల విజయలక్ష్మీ నర్సింహం, అధ్యాపకులు, విద్యార్థులు సాయి సత్యనారాయణమూర్తికి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఉరి వేసుకుని విద్యార్థిని మృతి భీమవరం టౌన్ : అనారోగ్యంతో ఒక విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ ఎం.రమేష్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక బలుసుమూడి ప్రాంతానికి చెందిన బి.మహిమా జ్యోతి (16) పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడంతో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోని బాత్రూమ్లోకి వెళ్లి ఉరివేసుకుంది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉరివేసుకుని ఇద్దరి బలవన్మరణం
పాలకోడేరు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఉరి వేసుకుని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శృంగవృక్షం పరిధిలోని బంటుమిల్లి గ్రామానికి చెందిన కట్టా శ్రీను (36) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరవాసరం గ్రామానికి చెందిన భాజింకిæ భోగేశ్వరరావు, కె.అప్పారావు శృంగవృక్షంలో చేపల చెరువులను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కట్టా శ్రీను చెరువులపై మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం చెరువును లీజుకు తీసుకున్న యజమానుల బంగారు గొలుసు చోరీకి గురికావడంతో వారు శ్రీనుని అనుమానించారు. దీంతో రెండుసార్లు బంటుమిల్లి కుల సంఘంలో పంచాయితీ పెట్టారు. అయినా విషయం తేలలేదు. ఈ అవమానం భరించలేక గురువారం రాత్రి శ్రీను ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సి.హెచ్.వి.రమేష్ తెలిపారు. వివాహిత ఆత్మహత్య పోలవరం రూరల్ : మండలంలోని సింగన్నపల్లి పునరావాస కేంద్రంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్న పూనెం పోశమ్మ (29)కి తొమ్మిదేళ్ల క్రితం సురేష్‌తో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పోశమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గతంలోనూ ఆత్మహత్యకు యత్నించింది. ఒకసారి గోదావరి నదిలో దిగితే గ్రామస్తులు రక్షించారు. గురువారం రాత్రి భర్త గదిలో ఉన్న సమయంలో తాళం పెట్టి వరండాలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఆమెను పోలవరం వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి రామాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి
జిల్లాలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో విద్యుత్ స్తంభం మీద పడడంతో లైన్‌మేన్ ప్రాణాలు కోల్పోయాడు. కాళ్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో మరోవ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మొగల్తూరు మండలం ఎల్బీ చర్ల, దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యం కాగా పెదవేగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. విద్యుత్ స్తంభం మీద పడి.. ఏలూరు (టూటౌన్),న్యూస్‌లైన్ : నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం మీద పడడంతో ఓ విద్యుత్ ఉద్యోగి శనివారం మృతి చెందాడు. ఏలూరు మండలం శనివారపుపేటకు చెందిన రావినూతల శ్రీనివాస్ (43) పెదవేగి మండలం పెదకడిమిలో లైన్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం శ్రీనివాస్‌పై పడింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ ఉద్యోగులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. గుర్తుతెలియని మహిళ దుర్మరణం నిడదవోలు, న్యూస్‌లైన్ : నిడదవోలు రైల్వేస్టేషన్ పరిధిలోని సింగవరం సమీపంలో ట్రాక్‌పై శనివారం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్లే గుర్తుతెలియని రైలు ఢీ కొని ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఐదడుగుల పొడవు, చామనఛాయ రంగులో ఉందని, 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో మృతదేహం పడి ఉండడాన్ని బట్టి ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెచ్‌సీ పరమహంస తెలిపారు. మృతురాలిని గుర్తుపట్టిన వారు 92474 03097 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. ఎల్బీ చర్ల చెరువుగట్టుపై.. మొగల్తూరు, న్యూస్‌లైన్: మొగల్తూరు మండలం ఎల్బీ చర్ల చెరువుగట్టుపై గుర్తుతెలియని మృతదేహన్ని స్థానికులుగుర్తించారు. ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని వడేటి పర్ర మురుగుకాలువ గట్టును ఆనుకుని ఉన్న పెద్దపట్నపు రామారావు చెరువు వద్ద మృతదేహం పడి ఉందన్నారు. మృతుడి ఎడమచేతిపై వీఆర్ సింహాచలం అని పచ్చబొట్టు రాసి ఉందని, మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. మృతుడు ఐదు రోజులుగా గ్రామంలో పిచ్చికేకలు వేస్తూ సంచరించినట్టు గ్రామస్తులు తెలిపారు. అతడి వివరాలు తెలిస్తే 9440796619 నెం.కు తెలపాలని కోరారు. అనుమానాస్పదస్థితిలో.. పెదవేగి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని విజయరాయి స్పిన్నింగ్‌మిల్లు సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై కె.స్వామి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదపాడు మండలం రామచంద్రపురానికి చెందిన ముంగంటి సూర్యనారాయణ (35) ఫ్యాక్టరీలకు కూలీలను పంపిస్తుంటాడు. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద నుంచి సూర్యనారాయణ ఫ్యాక్టరీకి వెళ్లాడు. శనివారం ఉదయం సూర్యనారాయణ మృతి చెందినట్టు తనకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు అతని భార్య రమాదేవి చెప్పారని, ఫ్యాక్టరీకి చెందిన వారెవరో తన భర్తను కొట్టి చంపి ఉంటారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ : సాధారణంగా వేసుకునే మాత్రలకు బదులు పొరపాటున వేరే మందు బిళ్లలు వేసుకుని అస్వస్థతకు గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు బావిశెట్టివారి పేటకు చెందిన బలువూరి రమ్య (19) ఏలూరు హేలాపురి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం ఇంటిలో ఒంటరిగా ఉన్న రమ్య ఏవో మాత్రలను వేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చేసరికి రమ్య మృతి చెందింది. వన్‌టౌన్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం గౌరీపట్నం (దేవరపల్లి), న్యూస్‌లైన్: దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రం వెనుక వైపున క్వారీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సర్పంచ్ మెరిపో వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా పాడైపోయి దుర్వాసన వెదజల్లుతూ గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉందని హెడ్ కానిస్టేబుల్ కె.సూరిబాబు తెలినపారు. మృతుడికి 35 ఏళ్లు ఉంటాయని, ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.