ఇద్దరు విద్యార్థుల బలవన్మరణం
Published Sat, Sep 10 2016 1:36 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
వీరవాసరం : అంతుబట్టని కారణాలతో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిండు జీవితాలను ముగించేశారు. ఆత్మహత్యల నివారణ దినం ముందు రోజు ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపారు.
ఓ యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శుక్రవారం జరిగింది. వీరవాసరం మండలం తోలేరు గ్రామానికి చెందిన గన్నపురెడ్డి సాయి సత్యనారాయణ(19) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గది తలుపులు వేసి ఉండడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వాటిని బద్దలు కొట్టారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని సత్యనారాయణ విగతజీవిగా ఉండడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. వీరవాసరం పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ మూడో సంవత్సరం చదువుతున్న సాయి సత్యనారాయణ మృతితో తోలేరులో విషాదఛాయలు అలముకున్నాయి. సత్యనారాయణకు తల్లి, సోదరుడు ఉన్నారు. తండ్రి గతంలోనే చనిపోయాడు. ఇంటికి పెద్ద కొడుకు మరణవార్తను ఆ తల్లి జీర్ణించుకోలేక శోకసంద్రంలో మునిగారు. వీరవాసరం పాలిటెక్నిక్ కళాశాలలో సత్యనారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వర్ధినీడి సత్యనారాయణమూర్తి, కురెళ్ల విజయలక్ష్మీ నర్సింహం, అధ్యాపకులు, విద్యార్థులు సాయి సత్యనారాయణమూర్తికి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
ఉరి వేసుకుని విద్యార్థిని మృతి
భీమవరం టౌన్ : అనారోగ్యంతో ఒక విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ ఎం.రమేష్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక బలుసుమూడి ప్రాంతానికి చెందిన బి.మహిమా జ్యోతి (16) పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడంతో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుంది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement