సాక్షి, వరంగల్: గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ‘ప్రవళిక’ ఆత్మహత్య రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఓవైపు పోటీ పరీక్షలు వాయిదా పడుతుండడాన్ని జీర్ణించుకోలేక దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక హైదరాబాద్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో పోలీసులు చెప్పారని, అది నిజం కాదని రాహుల్ గాంధీ చెప్పగలరా అంటూ మంత్రి కేటీఆర్ అన్న మాటలు మంటలు రేపాయి.
దీంతో ఆ అమ్మాయి గ్రూప్స్‌నకు దరఖాస్తు చేయడంతోపాటు పరీక్ష రాసిందంటూ సంబంధిత డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ దూతలు బిక్కాజిపల్లికి సోమవారం ఉదయమే చేరుకొని ప్రవల్లిక తల్లిదండ్రులు లింగయ్య, విజయ, సోదరుడు ప్రణయ్‌లను సిరిసిల్లకు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిపించినట్టుగా తెలిసింది. ‘మీ కుటుంబసభ్యులకు అండగా ఉంటాం’ అని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారని పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఈ వివాదానికి ఇక్కడికే ఫుల్‌స్టాప్ పెట్టారన్న చర్చ జరుగుతోంది.
దరఖాస్తు చేసింది.. పరీక్ష రాసింది
ప్రవళిక అసలు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేదని, ఎలాంటి పరీక్షలు రాయలేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం, ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఆరోపణలు చేస్తుండడంపై ప్రవళిక బంధువులు, కుటుంబ సభ్యులు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రవళిక క్యారెక్టర్‌పై నిందలు వేయడాన్ని వారు సహించలేకపోతున్నారు. గీతాంజలి డిగ్రీ కళాశాలలో 2020లో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉంది.
టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్–4, గ్రూప్–2 పరీక్షల కోసం ప్రవళిక దరఖాస్తు చేసినట్లు వారు చెబుతున్నారు. గ్రూప్–4 కోసం డిసెంబర్ 1, 2022న నోటిఫికేషన్ రావడంతో ఆమె 2023 జనవరి 10న దరఖాస్తు చేసింది. హాల్ టికెట్ పొంది.. జూలై ఒకటిన సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని మహర్షి విద్యానికేతన్ పాఠశాలలో గ్రూప్–4 పరీక్ష రాసింది. 2022 డిసెంబర్ 29న గ్రూప్–2కు నోటిఫికేషన్ రాగా.. 2023 ఫిబ్రవరి ఒకటిన దరఖాస్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment