ఉరివేసుకుని ఇద్దరి బలవన్మరణం
Published Sat, Sep 3 2016 1:43 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
పాలకోడేరు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఉరి వేసుకుని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శృంగవృక్షం పరిధిలోని బంటుమిల్లి గ్రామానికి చెందిన కట్టా శ్రీను (36) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరవాసరం గ్రామానికి చెందిన భాజింకిæ భోగేశ్వరరావు, కె.అప్పారావు శృంగవృక్షంలో చేపల చెరువులను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కట్టా శ్రీను చెరువులపై మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం చెరువును లీజుకు తీసుకున్న యజమానుల బంగారు గొలుసు చోరీకి గురికావడంతో వారు శ్రీనుని అనుమానించారు. దీంతో రెండుసార్లు బంటుమిల్లి కుల సంఘంలో పంచాయితీ పెట్టారు. అయినా విషయం తేలలేదు. ఈ అవమానం భరించలేక గురువారం రాత్రి శ్రీను ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సి.హెచ్.వి.రమేష్ తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
పోలవరం రూరల్ : మండలంలోని సింగన్నపల్లి పునరావాస కేంద్రంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్న పూనెం పోశమ్మ (29)కి తొమ్మిదేళ్ల క్రితం సురేష్‌తో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పోశమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గతంలోనూ ఆత్మహత్యకు యత్నించింది. ఒకసారి గోదావరి నదిలో దిగితే గ్రామస్తులు రక్షించారు. గురువారం రాత్రి భర్త గదిలో ఉన్న సమయంలో తాళం పెట్టి వరండాలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఆమెను పోలవరం వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి రామాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement