ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : ఒంగోలు ఒన్‌టౌన్, ఒంగోలు తాలుకా, సింగరాయకొండ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన ఏడుగురు అంతర్ జిల్లాల దొంగలను అరెస్టు చేసి వారి నుంచి రూ.12.65 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు ఎస్పీ ప్రమోద్‌కుమార్ తెలిపారు. స్థానిక తన చాంబర్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుల వివరాలు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులు దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరు చైన్‌స్నాచింగ్‌లకు కూడా పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. దొంగల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బయటకు వెళ్లే సమయంలో ఎక్కువగా ఆభరణాలు ధరించొద్దన్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగేందుకు పోస్టర్లు, డాక్యుమెంటరీ విడియోలను ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఒంగోలు ఒన్‌టౌన్ పరిధిలో..
స్థానిక లాయర్ పేటలోని అడపా బ్యానర్స్ సమీపంలో జూలై 3న అంబటి శ్రీదేవి తన కూమార్తెను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా జయప్రకాష్ కాలనీకి చెందిన మోటా శామ్యూల్, బండ్ల మిట్టకు చెందిన శ్రీనులు ఆమె మెడలోని 7 సవర్ల బంగారు చైన్‌ను దోచుకున్నారు. చైన్ విలువ రూ.1.40 లక్షలు ఉంటుంది.
ఈ కేసులో రూ. 70 వేల విలువైన బంగారాన్ని రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అదే విధంగా సీఆర్‌పీ క్వార్టర్స్‌లోని ఎ-10లో నివాసం ఉంటున్న ఎస్‌కే అబ్దుల్ జలీల్ ఇంటి వెనువైపున తలుపులు పగులగొట్టి 3 సవర్ల బంగారు చైన్‌ను, రూ. 30 వేల నగదును దొంగిలించిన కేసులో నిందితులు మోటా శామ్యూల్, చెప్పర్పల శ్రీను, ఎస్‌కే మస్తాన్‌లను గుర్తించినట్లు వివరించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి రూ. 45 వేల విలువైన ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలో..
స్థానిక సమతా నగర్‌కు చెందిన బొమ్మిశెట్టి రాజ్యలక్ష్మి ఈ నెల 5వ తేదీన పెళ్లూరు నుంచి ఒంగోలకు ఆటోలో వస్తుండగా కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన తమ్మిశెట్టి రాముడు,అతని మరదలు బత్తుల శాంతిలు ప్రయాణికుల్లా ఆటోఎక్కి రాజ్యలక్ష్మి వద్ద ఉన్న బ్యాగు నుంచి 9 సవర్ల బంగారాన్ని దొంగిలించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి చోరీ సొత్తు రికవరీ చేసినట్లు చెప్పారు. వీరిపై కర్నాటక రాష్ట్రం మైసూరు, తిరుమల, కడపలలో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో కేసులో నగరంలోని ప్రకాశం కాలనీ, వెంకటేశ్వరానగర్, జయ ప్రకాష్ కాలనీల్లో దొంగతనాలకు సంబంధించి నిందితుడు టంగుటూరు మండలం కారుమంచికి చెందిన వల్లూరు రాజును అరెస్టు చేసి అతని నుంచి 17 సవర్ల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సింగరాయకొండ పోలీసుస్టేషన్ పరిధిలో అనేక బైకులు చోరీ చేసిన కాళహస్తి శిరీష్ కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి అతని నుంచి 11 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడు ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండలలో అనేక బైకులు దొంగిలించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు శీరిష్ కుమార్‌రెడ్డి పీజీ చదివాడు. గతంలో ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఒంగోలు డీఎస్పీ పి.జాషువా, ఒన్‌టౌన్ సీఐ ప్రకాశరావు, తాలుకా సీఐ శ్రీనివాసన్, సింగరాయకొండ సీఐ అశోక్ వ ర్థన్‌రెడ్డి, సింగరాయకొండ ఎస్సై పాండురంగారావు, టంగుటూరు ఎస్సై వైవీ రమణ పాల్గొన్నారు.