ఎస్ కోట: బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ నగరంలోని మహిళా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎ.వరప్రసాదరావు సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రామ్మూర్తినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన జి.రమణ(32) విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురంలోని ఈనో కోళ్ల ఫారంలో పనిచేసేవాడు. అక్కడికి సమీపంలో పి.కనకమహాలక్ష్మి టీ దుకాణం నడుపుతుండేది. రమణ రోజూ టీ తాగడానికి అక్కడికి వెళ్లేవాడు. టీ దుకాణంలో సహాయకురాలిగా ఉండే ఓ బాలిక(15)తో పరిచయం పెంచుకుని 2010 జూన్ 6న ఆమెను అపహరించి అనకాపల్లి, అక్కడి నుంచి అరకు తీసుకువెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో కనకమహాలక్ష్మి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారం రోజుల తరువాత నిందితుడు రమణ, బాధితురాలిని పోలీసులు పట్టుకున్నారు. నిందితునిపై బాలిక అపహరణ, లైంగిక దాడికి సంబంధించి సెక్షన్ 363, 376 కింద కేసు నమోదు చేశారు. అప్పటి పెందుర్తి ఇన్‌స్పెక్టర్ భార్గవనాయుడు కేసు దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెండు సెక్షన్ల కింద ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తన తీర్పులో స్పష్టం చేశారు.
కామాంధుడికి ఏడేళ్ల జైలు
Published Tue, Mar 14 2017 12:49 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
Advertisement