వడ్డీ పేరిట పీల్చి పిప్పి చేసేస్తున్నారు..
♦ కమిషనరేట్‌కు క్యూ కడుతున్న కాల్‌మనీ బాధితులు
♦ బొండా ఉమా సహా పలువురిపై ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/విజయవాడ సిటీ: ఆడపిల్ల పెళ్లి.. కొడుకు చదువు.. వ్యాపార విస్తరణ.. ఇళ్ల కొనుగోలు.. ఇలా ఒకటేమిటి అనేక అవసరాల కోసం కాల్‌మనీ కేటుగాళ్ల బారిన పడి వీధుల పాలైన అనేక మంది విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు క్యూ కడుతున్నారు. కాల్‌మనీ బాధిత మహిళలు గుండెలవి సేలా రోదిస్తున్న తీరు కమిషనరేట్‌లో పోలీసులను సైతం కదిలించివేస్తోంది. ఐదు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన ఈ సెక్స్ రాకెట్‌లో ప్రాథమికంగా ఏడుగురు నిందితులను గుర్తించి కేసు నమో దు చేయగా, వీరిలో యలమంచిలి శ్రీరామమూర్తి అలి యాస్ రాము, దూడల రాజేష్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.
మిగిలిన నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. సీపీ ప్రకటనతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. తమను ఈ ఊబి నుంచి బయటపడేయాలంటూ ప్రాధేయపడుతున్నారు.ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కాల్‌మనీ వ్యాపారులకు అండగా ఉంటున్నాడంటూ బాధితులు ఆరోపించారు. బెజవాడలో లెక్కలేనన్ని కాల్‌మనీ సెంటర్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఎమ్మెల్యే బొండా సపోర్టు...
రామకృష్ణాపురానికి చెందిన మానేపల్లి రణధీర్ వద్ద వ్యాపార అవసరం కోసం రూ. 2.95 లక్షలు అప్పుగా తీసుకున్నాను. తొలుత నెలవారీ వడ్డీ అని చెప్పి కొద్ది రోజుల తర్వాత కాల్‌మనీ అన్నాడు. నెలకు రూ.90 వేల చొప్పున వడ్డీ కింద రూ. 5.60 లక్షలు చెల్లించాను. అసలు కింద రూ. 3 లక్షలు కట్టాను. ఐనా అప్పు తీరలేదంటూ ముందు తీసుకున్న చెక్కులతో మన్నెం కనకవల్లి అనే మహిళ ద్వారా కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. పైగా పొలం కూడా అతని ఆధీనంలోనే ఉంది. ముందు పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు. తర్వాత సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులపై ఒత్తిడి తేవడంతో వారు పట్టించుకోవడం లేదు. - డి.కిరణ్, దుర్గాపురం
కాల్‌మనీతో సంబంధం లేదు: బోడె
కంకిపాడు: కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న బోడె ప్రసాద్ సోమవారం సాయంత్రం కృష్ణాజిల్లా కంకిపాడులోని పసుపుకోటలో విలేకరులతో మాట్లాడారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో ఐదో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పారు. అతనితో కలసి విదేశీ పర్యటనలకు వెళ్లినంత మాత్రాన ఈ వ్యవహారంతో సంబంధం అంటగట్టడం తగదన్నారు. విదేశీ పర్యటనలో తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలను సైతం మార్ఫింగ్ చేసి సంబంధాలు న్నట్లుగా ప్రయత్నించడం శోచనీయమన్నారు.
తాళిబొట్టూ గుంజుకున్నారు...
కుటుంబ అవసరాల కోసం సమీప ప్రాంతానికి చెందిన అక్కా చెల్లెళ్లు దుర్గ, లక్ష్మి, విజయ, ఝాన్సీ నుంచి రూ. లక్ష తీసుకున్నాను. కొన్నాళ్లు వడ్డీ కట్టాను. ఆర్థిక ఇబ్బందులతో తర్వాత కట్టలేకపోయాను. దీంతో రూ.5 లక్షలు విలువ చేసే ఇంటిని గుంజుకున్నారు. ఇంకా చాలవంటూ మెడలోని పుస్తెల తాడు సహా నగలు గుంజుకొని ప్రైవేటు ఫైనాన్స్‌లో తనఖా పెట్టుకున్నారు. అయినా నా వద్ద తీసుకున్న ఖాళీ నోట్లు ఇవ్వడం లేదు. అదేమంటే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డ్రైవర్ పేరిట బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయండి.
- కాజ సులోచన, రాజీవ్‌నగర్
డబ్బులు కట్టినా స్థలం గుంజుకుంది
కష్టపడి దాచుకున్న డబ్బులతో మంటాడలో సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా. డబ్బు లు చాలకపోవడంతో కానూరుకు చెందిన చివులూరు విజయలక్ష్మి వద్ద రూ.4 లక్షలు అప్పు చేశాం. సక్రమంగానే వడ్డీ కట్టేవాళ్లం. స్టీరింగ్ ఆటోలను నగరంలోకి అనుమతించకపోవడంతో కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం. దీంతో కొన్న ఇంటి స్థలాన్ని కూతురు పేరిట బెదిరించి రాయించుకుంది విజయలక్ష్మి. తీసుకున్న చెక్కులు, నోట్లు కూడా ఇవ్వలేదు. అదేమంటే మా ప్రభుత్వమే అధికారంలో ఉందికాబట్టి ఎవరూ ఏం చేయలేరని బెదిరిస్తోంది.
- పట్టపు సత్యనారాయణ, వరలక్ష్మి, కానూరు, తులసీనగర్.