పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు
Published Sun, Oct 27 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
ఆమదాలవలస, న్యూస్‌లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పలు చోట్ల రైల్వే లైన్లు కోతకు గురయ్యాయి. దీంతో పలాస-విశాఖపట్నం పాసింజర్లు మినహా అన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఒడిశాలోని చిలకా నది సమీపంలోను, ఇచ్ఛాపురం, జాడుపూడి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే లైన్లు కోతకు గురయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు ప్రకటించారు. హౌరా-యశ్వంత్‌పూర్(12863/64), భువనేశ్వర్-బెంగుళూర్ (18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-చెన్నై (12839/40) మెయిల్, పాట్నా-ఎర్నాకుళం (16310) గౌహతి-ఎర్నాకుళం (12508), హౌరా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమాతో పాటు భువనేశ్వర్-విశాఖపట్నం(18411/12) ఎక్స్‌ప్రెస్‌ను ఇరువైపులా రద్దు చేశారు. భువనేశ్వర్ -ముంబాయి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించినట్లు తెలిపారు. పలాస-విశాఖపట్నం మధ్య పాసింజర్ సర్వీసులను మాత్రం యథావిధిగా కొనసాగించారు.
ప్రయాణికుల ఇక్కట్లు
రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్ల రద్దుకు సంబంధించిన సమాచారం కోసం బుకింగ్ కౌంటర్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. సమాచారం చెప్పడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్ల రద్దుతో ముందుగా చేసుకున్న రిజర్వేషన్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు సొమ్ము తిరిగి చెల్లించారు.
Advertisement
Advertisement