Prashanti Express
-
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం
గిద్దలూరు: ఏపీలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (భువనేశ్వర్- బెంగళూరు బౌండ్) రైలులో బీభత్సం సృష్టించిన దొంగలు.. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని, చైన్ లాగి రైలు ఆపి దర్జాగా పారిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సమీపంలోని కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీలసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే దొంగలు అడవుల్లోకి పారిపోయారని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచూ రైలు దోపిడీ ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ రైల్వే అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. -
మంత్రి కోసం రైలు ఎదురుచూపు!
ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోసం బెంగళూరు నుంచి విశాఖపట్టణం వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును కర్నూలు జిల్లా నంద్యాలలో సుమారు అరగంట సేపు ఆపేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల ఎన్జీఓ కాలనీలోని సాయి గురురాఘవేంద్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి రావాల్సి ఉంది. ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి బయలుదేరారు. కాని తమను ఆహ్వానించకుండా నిర్వహిస్తున్న వేడుకలకు మంత్రి హాజరు కావడం సరికాదని స్థానిక టీడీపీ నేత అధిష్ఠానానికి ఫిర్యాదు చేశాడు. దీంతో తాను ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వెళ్తానని స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకుని రైలును అరగంటపాటు ఆపారు. -
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు
ఆమదాలవలస, న్యూస్‌లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పలు చోట్ల రైల్వే లైన్లు కోతకు గురయ్యాయి. దీంతో పలాస-విశాఖపట్నం పాసింజర్లు మినహా అన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఒడిశాలోని చిలకా నది సమీపంలోను, ఇచ్ఛాపురం, జాడుపూడి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే లైన్లు కోతకు గురయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు ప్రకటించారు. హౌరా-యశ్వంత్‌పూర్(12863/64), భువనేశ్వర్-బెంగుళూర్ (18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-చెన్నై (12839/40) మెయిల్, పాట్నా-ఎర్నాకుళం (16310) గౌహతి-ఎర్నాకుళం (12508), హౌరా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమాతో పాటు భువనేశ్వర్-విశాఖపట్నం(18411/12) ఎక్స్‌ప్రెస్‌ను ఇరువైపులా రద్దు చేశారు. భువనేశ్వర్ -ముంబాయి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించినట్లు తెలిపారు. పలాస-విశాఖపట్నం మధ్య పాసింజర్ సర్వీసులను మాత్రం యథావిధిగా కొనసాగించారు. ప్రయాణికుల ఇక్కట్లు రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్ల రద్దుకు సంబంధించిన సమాచారం కోసం బుకింగ్ కౌంటర్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. సమాచారం చెప్పడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్ల రద్దుతో ముందుగా చేసుకున్న రిజర్వేషన్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు సొమ్ము తిరిగి చెల్లించారు.