
అంచనాలకు మించి ఆస్తినష్టం
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో జిల్లాలో అపార ఆస్తి నష్టం వాటిల్లింది. శిథిలాలు ఊడిపడటంతో సమాచార వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రెండు విడతలుగా పెనుగాలులు తీవ్రంగా వీయడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. పునరావాస కేంద్రాల్లో కూడా పరిస్థితి భయానకంగా మారడంతో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. విశాఖ కలెక్టరేట్ కూడా పూర్తిగా ధ్వంసమవడంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ రోజు తుపాను ప్రభావిత ప్రాంతాలను మంత్రి పి.నారాయణ పరిశీలించారు. 1996 తరువాత విశాఖలో మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చిందని నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం విశాఖలో ఏ రోడ్డు కూడా క్లియర్ గా లేదన్నారు. రోడ్లను క్లియర్ చేసేందుకు 200 పొక్లెయిన్ లను వినియోగిస్తామన్నారు. ఆస్తినష్టం అంచనాకు మించి ఉందని మంత్రి తెలిపారు. ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని, ఆస్తి నష్టంను తీవ్రతను తగ్గించలేకపోయామన్నారు. సోమవారం ఉదయం 10 గం.ల తర్వాతే సహాయకచర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. తన కారు అద్దాలు కూడా పగిలిపోయాయని మంత్రి తుపాను పరిస్థితిని విశ్లేషించారు.